
అచ్చంపేట అభివృద్ధికి నిధులు ఇవ్వండి
అచ్చంపేట: నియోజకవర్గంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే డా.చిక్కడు వంశీకృష్ణ సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో ఆయన సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణంలో పెండింగ్ పనులతో పాటు అదనంగా వెయ్యి ఇందిరమ్మ ఇళ్లు, ఉల్పర–కల్వకుర్తి వరకు డబుల్ రోడ్డు, అచ్చంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నూతన భవనం, మహిళా డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోరారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందిస్తూ.. సంబంధిత శాఖ అధికారులకు వెంటనే ఆదేశాలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
డీసీసీబీ సీఈఓ నియామకం నిలిపివేత
సాక్షి, నాగర్‌కర్నూల్/ మహబూబ్‌నగర్ (వ్యవసాయం): మహబూబ్‌నగర్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ సీఈఓ నియామకాన్ని నిలిపివేస్తూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది. సీఈఓ నియామకానికి అవసరమైన నిబంధనలు పాటించకపోవడంతో ఆయన నియామకాన్ని నిరాకరించినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ డీసీసీబీ సీఈఓగా డి.పురుషోత్తమరావును ఈ ఏడాది జూలై 14న నియమించాలని కోరుతూ కమిటీ పంపిన ప్రతిపాదనను ఆర్బీఐ తిరస్కరిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. దీనిపై మహబూబ్‌నగర్ డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి స్పందిస్తూ సీఈఓ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనను మాత్రమే ఆర్బీఐ తిరస్కరించిందని, నియామక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదని పేర్కొన్నారు.
ఎస్పీ పేరిట..
ఫేస్‌బుక్‌లో నకిలీ ఐడీ
నాగర్‌కర్నూల్ క్రైం: నాగర్‌కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పేరిట ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్‌ను క్రియేట్ చేశారు. ఈ మేరకు గురువారం గుర్తించిన ఎస్పీ ఈ నకిలీ ఐడీ నుంచి వచ్చే మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దని కోరారు. అలాగే ఎస్పీ ఆదేశాలతో ఫేస్‌బుక్‌లో ఏర్పాటు చేసిన నకిలీ ఐడీపై జిల్లా సైబర్ క్రైం విచారణ చేపట్టింది.
అవకతవకలపై
విచారణ జరపాలి
కోడేరు: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎండీ ఫయాజ్ డిమాండ్ చేశారు. గురువారం మండలకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి.. ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు చేశారని ఆరోపించారు. ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు చేపట్టడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీఓ శ్రావణ్‌కుమార్‌కు అందజేశారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి కిరణ్ పాల్గొన్నారు.
కురుమూర్తి దేవస్థానానికి రూ.2.02కోట్ల ఆదాయం
చిన్నచింతకుంట: కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు, జాతరను పురస్కరించుకొని అధికారులు నిర్వహించిన వేలం పాటలు గురువారం ముగిశాయి. ఆలయం వద్ద కొబ్బరికాయలు, లడ్డూ ప్రసాదం విక్రయించడానికి, కొబ్బరి చిప్పలు, తలనీలాల సేకరణ, లైటింగ్, డెకరేషన్ ఏర్పాట్లు, పూలు, పూజ సామగ్రి విక్రయం, జాతరలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి నిర్వహించిన వేలంలో రూ.2,02,75,000 ఆదాయం ఆలయానికి సమకూరిందని దేవాదాయశాఖ అధికారులు తెలిపారు.

అచ్చంపేట అభివృద్ధికి నిధులు ఇవ్వండి

అచ్చంపేట అభివృద్ధికి నిధులు ఇవ్వండి