
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
నాగర్‌కర్నూల్ క్రైం: డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ కోరారు. జిల్లా కేంద్రంలోని నెల్లికొండ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో గురువారం డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు లోనుకాకుండా భవిష్యత్‌పై దృష్టిసారించాలని సూచించారు. డ్రగ్స్ వినియోగంతో చదువుపై ప్రతికూల ప్రభావం చూపడంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేస్తుందన్నారు. అదే విధంగా నేరాలకు పాల్పడే అవకాశం పెరుగుతుందని హెచ్చరించారు. ఒకప్పుడు డ్రగ్స్ ప్రభావం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఉండేదని.. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. గ్రామీణ సంస్కృతీ సంప్రదాయాలు కూడా డ్రగ్స్ వల్ల దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థులు తమ జీవిత లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకొని క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. డ్రగ్స్ రహిత జిల్లాగా నిర్మించడంలో విద్యార్థులే సైనికు ల్లా ముందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ రవాణా, వాడకం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై పోలీస్‌శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, ఏదేని ఘటనల గురించి నిర్భయంగా పోలీసులకు సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. సమాజాన్ని మార్చగల శక్తి విద్యార్థులకే ఉంటుందని.. డ్రగ్స్ అనే అనర్థాన్ని తిప్పికొట్టడంలో ముఖ్యపాత్ర పోషించాలన్నారు. దేశ భవిష్యత్, ఆరోగ్యం, సుస్థిర ఆలోచనలతో ఎదగాలన్నారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. డ్రగ్స్‌తో కలిగే అనర్థాలపై రాష్ట్రస్థాయిలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో ఉత్తమ ప్రతిభకనబరిచిన ఇద్దరు విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ గోవర్ధన్, అకాడమిక్ మానిటరింగ్ కోఆర్డినేటర్ అంజయ్య, కళాశాల యాంటీ డ్రగ్ కోఆర్డినేటర్ వనిత తదితరులు పాల్గొన్నారు.