
విద్యార్థులకు దిక్సూచి.. టీఎల్‌ఎం
కందనూలు: టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ విద్యార్థులకు దిక్సూచి లాంటిదని డీఈఓ రమేశ్‌కుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో జిల్లాస్థాయి టీఎల్‌ఎం మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. టీఎల్‌ఎంతో విద్యార్థులకు సులభంగా బోధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను మెరుగుపర్చుకొని కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలని సూచించారు. అయితే రెడీమెడ్‌గా కాకుండా ఉపాధ్యాయులు సొంతంగా తయారుచేసిన టీఎల్‌ఎంలను ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. జిల్లాస్థాయి మేళాలో 20 మండలాల నుంచి 200 టీఎల్‌ఎంలను ప్రదర్శించగా.. నాలుగు విభాగాల నుంచి 8 ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు డీఈఓ తెలిపారు. ఇంగ్లిష్ విభాగంలో బిజినేపల్లి మండలం కారుకొండ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని భాగ్యలక్ష్మి, అచ్చంపేట మండ లం లక్ష్మాపూర్ యూపీఎస్ ఉపాధ్యాయిని ఎం.శ్రీలక్ష్మి, తెలుగు విభాగంలో కొల్లాపూర్ మండలం వరి దెల స్కూల్ టీచర్ చంద్రకళ, లింగాల మండలం అప్పాయిపల్లి యూపీఎస్ ఉపాధ్యాయుడు పి.అనిల్, గణితం విభాగంలో అమ్రాబాద్ పీఎస్ ఉపా ధ్యాయుడు కె.ఎల్లయ్య, పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి పీఎస్ ఉపాధ్యాయుడు ఎస్.బ్రహ్మాచారి, ఎన్విరాన్మెంట్ సైన్స్ విభాగంలో పదర మండలం ఇప్పలపల్లి యూపీఎస్ టీచర్ జె.మోతీభాయ్, బిజినేపల్లి మండలం గౌరారం పీఎస్ ఉపాధ్యాయుడు జె.వేణు రూపొందించిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు కిరణ్‌కుమార్, నూరుద్దీన్, శోభారాణి, వెంకటేశ్వరశెట్టి, కార్యాలయ పర్యవేక్షకుడు నాగేందర్ పాల్గొన్నారు.