
ఏఎస్పీగా వెంకటేశ్వర్లు
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లా అదనపు ఎస్పీగా వెంకటేశ్వర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో రిజర్వులో ఉండగా.. జిల్లాకు కేటాయించారు. ఇక్కడ అదనపు ఎస్పీగా పనిచేసిన రామేశ్వర్ గతనెలలో బదిలీ అయ్యారు.
రవాణారంగ కార్మికులకు జీవన భృతి చెల్లించాలి
నాగర్‌కర్నూల్ రూరల్: మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటో రవాణారంగ కార్మికులకు ప్రభుత్వం రూ. 12వేల చొప్పున జీవనభృతి చెల్లించాలని ఆటో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పొదిలి రామయ్య డిమాండ్ చేశారు. గురువారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన రవాణారంగ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో ఆటో రవాణారంగ కార్మికుల జీవితాలను నాశనం చేసిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆటోలు నడవడం లేదని.. ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. జీవనోపాధి లేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. ప్రభుత్వం తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తుందని అన్నారు. ఆటో కార్మికులకు జీవనభృతి చెల్లించి ఆదుకోవాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి, పొదిల రాజు, విజయ్, అంజి, మహేశ్, నర్సింహ, బాబా ఇమ్రాన్, బాషా, వెంకటేశ్ తదితరులు ఉన్నారు.