
భూ భారతి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు
వెల్దండ/తాడూరు: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ ఆదేశించారు. గురువారం వెల్దండ, తాడూరు తహసీల్దార్ కార్యాలయాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ఆయా మండలాల్లో నెలకొన్న భూ సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి చట్టం మేరకు భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వివిధ భూ సమస్యలపై 17వేలకు పైగా దరఖాస్తులు అందినట్లు తెలిపారు. వాటిలో 3వేలు సాదాబైనామా, 5వేలు అసైన్డ్ భూముల కోసం, 9వేలు సాధారణ భూ సమస్యలపై ఫిర్యాదులు అందినట్లు వివరించారు. ఇప్పటి వరకు దాదాపు 1,000 దరఖాస్తులను పరిష్కరించినట్లు తెలిపారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో భూ సమస్యలను పరిశీలించి.. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో రెవెన్యూ సిబ్బంది కొరత లేకుండా ప్రభుత్వం వీఆర్‌ఓల స్థానంలో 189మంది జీపీఓలతో పాటు లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించిందని తెలిపారు. కార్యక్రమాల్లో తహసీల్దార్లు కార్తీక్‌కుమార్, జయంతి, డిప్యూటీ తహసీల్దార్లు కిరణ్‌కుమార్, మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు.