
పట్టణ ప్రణాళిక ఖరారు
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీల్లో మౌళిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారం, దీర్ఘకాలికంగా నెలకొన్న ప్రజా అవసరాలను తీర్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రూపొందించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సోమవారం నుంచి వందరోజులపాటు ఒక్కో కార్యక్రమం చేపట్టేలా తీర్మానించింది. ఇందులో ప్రజా అవసరాలు, వారి సమస్యల దృష్ట్యా ఒక్కో సమస్యను తీర్చేందుకు వాటి సామర్థ్యాన్ని బట్టి కొన్ని రోజులు అదే పనికి ప్లాన్‌లో రోజులను కేటాయించారు. ఇలా వందరోజుల యాక్షన్ ప్లాన్‌కు అనుగుణంగా ఇప్పటికే జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో వార్డు అధికారులకు బాధ్యతలు కేటాయించి, క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను నోట్ చేసుకునేలా పురమాయించారు. ఆయా వార్డుల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి వాటిని పూర్తిస్థాయిలో తీర్చేలా బడ్జెట్ కేటాయించి పనలు పూర్తిచేసేలా చూడనున్నారు.
రోజుల వారీగా పనులు
ప్రభుత్వం చేపట్టిన వందరోజుల ప్రణాళికలో 60 రోజులు, 30 రోజులు, వారం రోజులు ఇలా పనిని బట్టి రోజులను అధికారులు నిర్దేశించారు. ఇందులో వందరోజులలో ప్రతిరోజు చేపట్టే కార్యక్రమాల్లో భాగంగా మున్సిపాలిటీలో పరిశుభ్రత, వ్యర్థాలను వేరు చేయడంపై స్థానిక వార్డులలో ప్రచారం నిర్వహించాలి. సాలిడ్ వేస్టేజ్ మేనేజ్‌మెంట్‌లో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం, ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించేలా చేయాలి. వ్యర్థాల విభజన, పరిశుభ్రత, ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణ, పరిశుభ్రత, వ్యర్థాల విభజనపై ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించాలి. కంపోస్టును ఉత్పత్తి చేయడానికి సేంద్రియ వ్యర్థాలను కంపోస్టు చేసేలా ప్రోత్సహించాలి. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత, వ్యర్థాల విభజన, ప్రజారోగ్యం గురించి అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేయాలి. నూతన ఎస్‌హెచ్‌జీలను ఏర్పాటు చేయడం, అర్హత కలిగిన వారికి బ్యాంకు లింకేజీ స్కీంలను ఎస్‌హెచ్‌జీలకు అందించాలి. మున్సిపాలిటీలలో ఒకే వ్యాపారాన్ని నిర్వహిస్తున్న వారిని గుర్తించి వారికి రుణాలు అందేలా చూడాలి. రానున్న వానాకాలానికి సంబంధించి తాగునీరు కాలుష్యం కాకుండా క్లోరినేషన్ ప్రక్రియ చేపట్టాలి.
● ప్రతిరోజు చేపట్టే కార్యక్రమాలే కాకుండా ఎంపిక చేసిన రోజులలో మున్సిపాలిటీలో చెట్లు నాటడం, వాటిని సంరక్షించేలా జూలై మొదటి మా సంలో వనమహోత్సవం ఏర్పాటు చేయాలి. చిన్నపిల్లలు, యువకులకు పర్యావరణ అవగాహనతోపాటు వారిని ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమా లు చేపట్టాలి. వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్‌లో భాగంగా అన్ని వార్డులలో కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆర్‌డబ్ల్యూహెచ్ వ్యవస్థను పటిష్టపరచాలి. ఏబీసీ సెంటర్ల నిర్వహణతోపాటు వీధి కుక్కలకు 100 శాతం స్టెరిలైజేషన్ చేయాలి. మున్సిపాలిటీల్లోని నాలాలలో చెత్త పడకుండా మెష్‌ను ఏర్పాటు చేయాలి.
మున్సిపాలిటీలలో వందరోజులకార్యాచరణ చేపట్టనున్న అధికారులు
ప్రజా సమస్యలు, వానాకాలం యాక్షన్ ప్లాన్ కలిపి అమలు
ఇకనైనా పట్టణాల్లో సమస్యలు తీరేనా..?