ఆమెకే ప్రాధాన్యం! | - | Sakshi
Sakshi News home page

ఆమెకే ప్రాధాన్యం!

Oct 7 2025 3:29 AM | Updated on Oct 7 2025 3:29 AM

ఆమెకే ప్రాధాన్యం!

ఆమెకే ప్రాధాన్యం!

పోటెత్తుతున్న

దరఖాస్తులు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

సా్థనిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు మహిళలకు కలిసి వస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి పురుషులకంటే మహిళలకే ఎక్కువ అవకాశాలు దక్కనున్నాయి. ఉమ్మడి వరంగల్‌లో జనాభా, ఓటర్ల సంఖ్యతో పాటు ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లు కూడా ‘ఆమె’కే ప్రాధాన్యం ఇచ్చాయి. ఈనేపథ్యంలో.. రిజర్వేషన్లు కలిసొచ్చే (భార్య లేదా భర్త) పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ప్రధాన పార్టీల నాయకులు. సుమారు రెండేళ్ల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలకు సెప్టెంబర్‌ 29న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈనెల 9 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కానుండగా.. నవంబర్‌ 11న ఓట్ల లెక్కింపుతో ముగియనుంది. రేపటి హైకోర్టు తీర్పు వెలువడడమే తరువాయి తమకు కేటాయించిన స్థానాల్లో నామినేషన్లు వేసేందుకు మహిళలు రెడీ అవుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయా పార్టీలకు వారు దరఖాస్తులు కూడా చేసుకున్నారు.

ఓటర్లుగా ఆధిక్యం.. సీట్లలోనూ ప్రాధాన్యం

జనవరి 5న ప్రకటించిన తుది జాబితా ప్రకారం.. ఉమ్మడి వరంగల్‌లో ఓటర్ల సంఖ్య 30,43,540కు చేరింది. పురుషులు, మహిళలు, ఇతరులు, సర్వీసు ఓటర్లు కలిపితే 30.44 లక్షలకు చేరగా.. ఈసారి మహిళలదే అగ్రస్థానం. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 12 నియోజకవర్గాల్లో మొత్తం 30,43,540 మంది ఓటర్లు ఉంటే, అందులో పురుషులు 14,89,606 కాగా, మహిళా ఓటర్లు 15,51,289 ఉన్నారు. ఇతరులు (థర్డ్‌జెండర్స్‌) 504 కాగా, సర్వీసు ఓటర్లు 2,141. ఉమ్మడి వరంగల్‌కు వచ్చేసరికి 12 నియోజకవర్గాల్లో అత్యధికంగా నమోదైన మహిళా ఓటర్లు పురుషులతో పోలిస్తే 61,683 మంది ఎక్కువగా ఉన్నారు. ఈనేపథ్యంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వారికే ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్‌లో ఆరు జిల్లా ప్రజా పరిషత్‌లు ఉండగా.. ములుగు ఎస్టీ మహిళ, హనుమకొండ, జనగామ ఎస్సీ మహిళలకు కేటాయించారు. 75 జెడ్పీటీసీలకుగాను 38 మహిళలకు దక్కాయి. 39 ఎంపీపీ స్థానాలు మహిళలకు దక్కనున్నాయి. అదేవిధంగా 778 ఎంపీటీసీ స్థానాల్లో 399, 1708 గ్రామ పంచాయతీల్లో 860 చోట్ల మహిళలకే అవకాశం దక్కనున్నట్లు అధికారులు విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.

వార్డులు: 15,006

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో.. ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఈక్రమంలో అధికార పార్టీ కాంగ్రెస్‌ రెండు రోజులుగా నియోజకవర్గాల్లో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. స్టేషన్‌ఘన్‌పూర్‌, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట తదితర నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ఆశావహులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపారు. వార్డు సభ్యుల నుంచి జెడ్పీటీసీ వరకు దరఖాస్తులు చేసుకోగా.. మహిళా రిజర్వేషన్‌ స్థానాల్లో ఆశావహులు గట్టిగానే తలపడినట్లు పార్టీ వర్గాల సమాచారం. బీఆర్‌ఎస్‌, బీజేపీలు కూడా ఛాలెంజ్‌గా తీసుకుని అభ్యర్థుల వేటలో పడ్డాయి. బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఈసారి మహిళలకు అత్యధిక స్థానాలు రిజర్వ్‌ కావడంతో ఆ స్థానాల్లో గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసే దిశగా అన్ని పార్టీలు తల మునకలవుతున్నాయి.

ఆరు జెడ్పీల్లో మూడు చోట్ల మహిళలే..

ఉమ్మడి జిల్లాలోని 75 జెడ్పీటీసీల్లో 38,

ఎంపీపీలుగా 39 మందికి ఛాన్స్‌

ఎంపీటీసీ, పంచాయతీల్లోనూ

అతివలకే అగ్రస్థానం

రిజర్వేషన్లతో కలిసివస్తున్న అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement