
ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు ఓకే..!
ఇక పార్ట్‌టైం లెక్చరర్ల నియామకం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో 2010లో నియామకమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఎట్టకేలకు పదోన్నతులు కల్పిస్తూ కేయూ పాలకమండలి సమావేశం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరి నియామకాలను గత పాలకమండలిలో ఆమోదించినా పెండింగ్‌లో ఉండిపోయింది. తాజా సమావేశంలో పదోన్నతి అంశం చర్చకు వచ్చి పదోన్నతులకు చివరికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలోనే వీరికి క్యాస్ పదోన్నతులు లభించనున్నాయి. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశంలో ఎజెండాలోని పలు అంశాలపై చర్చించి ఆమోదించినట్లు తెలిసింది. యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో రెగ్యులర్ ఆచార్యుల కొరతతో వర్క్‌లోడ్ అధికంగా ఉంది. ఇందుకనుగుణంగా పార్ట్‌టైం లెక్చరర్లను నియమించడం లేదు. ఇటీవల వివిధ విభాగాల్లో పేపర్ వైజ్‌గా నియామకాలు చేపట్టారు. పార్ట్‌టైం లెక్చరర్లను నియమించాలనే విషయంపై పాలక మండలిలో చర్చించారు. వర్క్‌లోడ్‌కు అనుగుణంగా 130 మందిని నియమించుకునేందుకు పాలకమండలి ఆమోదించింది. ఇందుకోసం నోటిఫికేషన్ ఇచ్చి అర్హులైనవారిని నియమనిబంధనలకు అనుగుణంగా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారి పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లనుంచి 65 ఏళ్లవరకు పెంచుతూ ఆమోదించింది. రెగ్యులర్ ఆచార్యులకు మాదిరిగానే వీరికి ఉద్యోగ విరమణ ఉండనుంది. టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు మరణిస్తే అంత్యక్రియల ఖర్చు రూ.20వేల నుంచి రూ.30వేలకు పెంచుతూ ఆమోదించింది. యూనివర్సిటీ భూమిలో ఇల్లు కలిగి ఉండటంతో పాటుగా పలు ఆరోపణలతో ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న ఓ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌పై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం న్యాయపరమైన అంశాలను పరిగణనలోనికి తీసుకొని ముందుకెళ్లాలని పాలకమండలి సూచించినట్లు సమాచారం.
ప్రహరీ నిర్మాణానికి ఓకే.
కాకతీయ యూనివర్సిటీలోని భూమి చుట్టూ ప్రహరీ నిర్మించాలనే విషయంపై మళ్లీ పాలకమండలిలో చర్చకు రాగా రూ.20కోట్ల వ్యయంతో కొంత ఎత్తుగా ఉండేలా నిర్మాణాన్ని ప్రభుత్వ సంస్థ టీజీడబ్లూ ఐడీసీకి అప్పగించాలని చర్చించినట్లు సమాచారం. పాలకమండలిలో నిర్ణయించిన ప్రకారం యూనివర్సిటీ అధికారులు ముందుకెళ్లాలని నిర్ణయించారని విశ్వసనీయంగా తెలిసింది. సమావేశంలో కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, ఉన్నత విద్య కమిషనర్ శ్రీదేవసేన, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, పాలకమండలి సభ్యులు ఆచార్య బి.సురేష్‌లాల్, డాక్టర్ కె.అనితారెడ్డి, డాక్టర్ రమ, డాక్టర్ చిర్రా రాజు, సుకుమారి, మల్లం నవీన్, బాలు చౌహాన్ టి.సుదర్శన్ పాల్గొన్నారు.
కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంపు
రూ.20కోట్లతో ప్రహరీ నిర్మాణం
కేయూ పాలకమండలి సమావేశంలో ఆమోదం