
తొలి విడతలో పైలట్ ప్రాజెక్టు కింద 8 పాఠశాలల ఎంపిక
8 పాఠశాలలు ఎంపిక
ములుగు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీని ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం పైలట్ ప్రాజెక్టు కింద అధికారులు పలు పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు లేకపోవడంతో ఆర్థిక భారం అయినప్పటికీ తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలనే నూతన ఆలోచనతో ప్రభుత్వం ప్రీ ప్రైమరీ విద్యాబోధనకు శ్రీకారం చుట్టింది. దీంతో ప్రీ ప్రైమరీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అలాగే కొనసాగితే విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు ఆస్కారం ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం కానున్నాయి. మూడేళ్లు పైబడిన చిన్నారులకు ఆటపాటలతో పాటు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేపట్టనున్నారు.
ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల ఎంపిక విధానం ఇలా..
ప్రీ ప్రైమరీ విద్యాబోధనకు నూతనంగా ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను ఎంపిక చేయనున్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో దరఖాస్తులను స్వీకరించి విధివిధానాల మేరకు అర్హతలను పరిశీలించి ఎంపిక చేయనున్నారు. ఇన్‌స్ట్రక్టర్లకు విద్యార్హత ఇంటర్మీడియట్, ఆయాలకు 7వ తరగతి అర్హత కలిగి ఉండాలి. 18– 44 మధ్య వయస్సు కలిగిన మహిళలు అర్హులు. ప్రీ ప్రైమరీకి ఎంపికై న పాఠశాలలకు సంబంధించిన గ్రామంలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయాలకు రూ. 6వేలు, ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.8 వేలు వేతనం అందించనున్నారు. ఎంపికై న పాఠశాలలకు రూ.1.20 లక్షల రంగులు, పరికరాల కొనుగోలుకు నిధులు కేటాయించారు. ఇన్‌స్ట్రక్టర్, ఆయాల ఎంపికను ఎంపీడీఓ చైర్మన్‌గా, మండల వి ద్యాశాఖ అధికారి కన్వీనర్, పంచాయతీ కార్యదర్శి కమిటీ మెంబర్‌గా ఉండి నిర్ణయిస్తారు. ఎంపిక చేసి న దరఖాస్తులను కలెక్టర్‌కు సమర్పించనున్నారు.
జిల్లాలో ఎంపికై న పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు చర్యలు చేపడుతున్నాం. ఇన్‌స్ట్రక్టర్, ఆయాల నియామకాలను ఎంపికై న మండలాల్లోని ఎంఈఓల ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటనలు విడుదల చేశాం. అక్టోబర్ నెల ఆఖరు వరకు ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభిస్తాం. ఎంపికై న పాఠశాలల్లో ప్రీ ప్రైమరీకి తగినట్లు రంగులు, పరికరాలు కొనుగోలు చేపడుతాం.
– సిద్ధార్థరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి
జిల్లాలోని 10 మండలాల్లో ప్రీ ప్రైమరీ విద్యాబోధనకు 8 పాఠశాలలను అధికారులు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అందులో మల్లంపల్లి మండల పరిధిలోని మాన్‌సింగ్‌తండా, గోవిందరావుపేటలోని ఎంపీపీఎస్ చల్వాయి పాఠశాల, ఎంపీపీఎస్ దుంపిల్లగూడెం పాఠశాల, మంగపేట మండలంలోని ఎంపీపీఎస్ మంగపేట, ఎంపీపీఎస్ తిమ్మంపేట, ఎంపీయూపీఎస్ దోమెడ, ఎస్‌ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని ఎంపీపీఎస్ కాటాపూర్, వెంకటాపురం(కె) మండల పరిధిలోని ఎంపీయూపీఎస్ ఎదిర పాఠశాలలు ఉన్నాయి.
ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల
నిర్వహణకు కసరత్తు
ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకానికి చర్యలు
మూడేళ్లు పైబడిన పిల్లలకు అడ్మిషన్లు