
పోడు భూముల్లో తుమ్మ మొక్కలు నాటొద్దు
ఏటూరునాగారం: అటవీశాఖ అధికారులు పోడు భూముల్లో తుమ్మ మొక్కలు నాటొద్దని.. పండ్ల మొక్కలు మాత్రమే నాటాలని రైతులు ఆందోళన దిగారు. ఈ ఘటన మండల పరిధిలోని చిన్నబోయినపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిన్నబోయినపల్లిలోని పోడు భూముల్లో అధికారులు తుమ్మ మొక్కలు నాటే పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో గతంలో ఆ భూములను సాగుచేసిన రైతులు అక్కడకు చేరుకుని అధికారులతో వాగ్వాదానాకి దిగారు. పండ్ల మొక్కలను మాత్రమే నాటాలని డిమాండ్ చేస్తూ 163వ జాతీయ రహదారిపై బైటాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు వడ్కాపురం సారయ్య, గంట కృష్ణారెడ్డి, చిట్టిపోతుల వినోదలు మాట్లాడుతూ 40 ఏళ్ల నుంచి ఆ భూములను సాగు చేసుకుంటున్నామని తెలిపారు. అటవీశాఖ అధికారులు తమను సాగుచేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తమతో అధికారులు పండ్ల మొక్కలను నాటుతామని చెప్పి తుమ్మ మొక్కలను నాటడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం, పాలకులు తమకు న్యాయం చేయాలని కోరారు. విషయం తెలుసుకున్న ట్రైయినీ ఎస్సై రుచిత్ర సిబ్బందితో అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. ఈ విషయంపై అటవీశాఖ రేంజ్ అధికారి అబ్దుల్ రెహమాన్‌ను వివరణ కోరగా ఆ భూమిలో వెదురు సాగు చేయగా కొంత మంది రైతులు దున్ని వేశారని తెలిపారు. ఆ రైతులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. అక్కడ ప్లాంటేషన్ చేయడం జరుగుతుందని, మొక్కలను నాటేందుకు వెళ్తుండగా తమను అడ్డుకున్నారని ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు. తాము నిబంధనలకు లోబడి విధులు నిర్వర్తిస్తున్నామని తెలిపారు.
అటవీశాఖ అధికారులు, రైతుల మధ్య వాగ్వాదం
163వ జాతీయ రహదారిపై
రైతుల ఆందోళన