
అధికారులు బాధ్యతతో పనిచేయాలి
ములుగు రూరల్: ఎంపీటీసీ. జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని తెలిపారు. జిల్లా కేంద్రంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రతీ మండలంలో మూడు లేదా నాలుగు ఎంపీటీసీ స్థానాలకు ఒక రిటర్నింగ్ అధికారితో పాటు ప్రతీ మండలంలో జెడ్పీటీసీ స్థానానికి సైతం అధికారిని కేటాయించినట్లు తెలిపారు. అధికారులు హ్యాండ్‌బుక్‌లోని అంశాలపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నామినేషన్ పేపర్లను స్వీకరించి పేర్లను నోటీసు బోర్డులో ప్రచురించాలని సూచించారు. అభ్యర్థులు ఉపసంహరణ ప్రతులను స్వీకరించాలని ఆదేశించారు. నామినేషన్ పత్రాలను తిరస్కరిస్తే దానికి గల కారణాలను తెలపాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా, గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పేపర్ పోలింగ్ కేంద్రాలు ఉపయోగించే ముద్రణలు పరిశీలించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్‌రావు, జిల్లా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర