
అనుమతులు వచ్చేశాయి..
మల్హర్: ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన తాడిచర్ల–భూపాలపల్లి రహదారి నిర్మాణానికి అటవీశాఖ నుంచి ఫేజ్–2 అనుమతులు రావడంతో నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు రోడ్డు నిర్మాణానికి అటవీ ప్రాంతంలో హద్దులు ఏర్పాటు చేశారు. మరోవైపు రోడ్డు నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే పనులు ప్రారంభం కానుండటంతో ఈ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం కాటారం మీదుగా భూపాలపల్లి..
మండల కేంద్రం తాడిచర్ల నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే ప్రస్తుతం కాటారం మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. తమ ప్రాంతం నుంచి పెద్దతూండ్ల మీదుగా అటవీ ప్రాంతం గుండా రహదారి నిర్మిస్తే ఎంతో సమయంతో పాటు ఎన్నో రకాల ప్రఝెజనాలు ఉన్నాయని ప్రజలు చెబుతున్నారు. మంథని నుంచి భూపాలపల్లికి వెళ్లే వారు కూడా ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చుకోవాల్సి వస్తుంది. ఏడాది క్రితం తాడిచర్ల–ఖమ్మంపల్లి గ్రామాల మధ్య మానేరు నదిపై వంతెన అందుబాటులోకి రావడంతో దూరభారం తగ్గింది.