
చిరునవ్వుతో జీవిద్దాం!
చిరునవ్వు దివ్య ఔషధం..
ఎన్నో ప్రయోజనాలు
ఖిలా వరంగల్: చిరునవ్వు.. వ్యక్తిత్వానికి ప్రతిబింబం. కొందరి చిరునవ్వు శత్రువునైనా సమ్మోహన పరుస్తుంది. అందుకే నవ్వులోని ఆప్యాయత, అనురాగం మరెందులోనూ ఉండదు. అయితే ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవనంలో చాలా మంది మనస్ఫూర్తిగా నవ్వడమే మరచిపోతున్నారు. తీవ్ర ఒత్తిడి, వివిధ సమస్యలతో నవ్వుకు దూరమవుతున్నారు. అయితే చిన్న చిరునవ్వుతో బాధలన్నీ మరచిపోవచ్చని చెబుతున్నారు వైద్యులు. చర్మం మెరుగులు దిద్దుకుంటుందని, ఆయుష్షు పెరుగుతుందని, మనుషుల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడతాయని స్పష్టం చేస్తున్నారు. నేటి జీవితంలో నవ్వకపోవడం రోగమేనని వారంటున్నారు. ఈ నేపథ్యంలో ఆధునిక జీవనంలో వేదనలు.. రోదనలు.. చింతనలు.. ఆలోచనల నడుమ హాయిగా నవ్వుకోవాల్సిన అవసరం ఉంది. ఆదివారం ప్రపంచ చిరునవ్వుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
నేటి నానుడి నవ్వు నాలుగు విధాలా స్వీట్..
నాటి నానుడి.. నవ్వు నాలుగు విధాలా చేటు. నేటి నానుడి.. నవ్వు నాలుగు విధాలా స్వీట్. నవ్వు ప్రకృతి ప్రసాదించిన వరం. ముఖానికి ఎన్ని సౌందర్య సాధనాలద్దినా.. చిరునవ్వుకు సరి తూగవు. మనసారా నవ్వితే శరీరంలో కొన్ని ప్రత్యేక రసాయనాలు విడుదలవుతాయి. కొండంత కోపాన్ని హరించి ఎలాంటి వాతావరణాన్నైనా చల్లబరిచేది చిరునవ్వే.
ప్రస్తుత సమజంలో మనుషుల
యాంత్రిక జీవనం..
ప్రస్తుత సమజంలో మనుషులు యాంత్రిక జీవనం గడుపుతున్నారు. ఎదుటి వ్యక్తితో మాట్లాడాలంటే సెల్‌ఫోన్ చూస్తూనో.. కంప్యూటర్ పనిలో ఉన్నప్పుడో కాస్త చిరునవ్వుతో పలకరిస్తున్నారు. ఇది కూడా కనీసం ఐదు సెకండ్లకు మించి ఉండడం లేదు. అంటే మనిషిని సాంకేతికత ఎంతగా అపహరించిందో అర్థం చేసుకోవచ్చు. చేతిలోకి సెల్‌ఫోన్ వచ్చిన తర్వాత కుటుంబమంతా సరదాగా నవ్వుకుని కాలం గడిపే రోజులు ఎప్పుడోపోయాయి. ఎదుటి మనిషితో మాటలు కరువయ్యాయి.
మనిషికి చిరునవ్వు దివ్య ఔషధంలా పనిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. రోజులో ఎక్కువ సార్లు నవ్వితే 15 నిమిషాలు వ్యాయామంతో సమానమని చెబుతున్నారు. నవ్వు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని వైద్యశాస్త్రం చెబుతుంది. అందుకే లాఫింగ్ క్లబ్‌లో బిగ్గరగా నవ్వుతూ వ్యాయామం చేస్తుంటారు. ఇటీవల నవ్వుతో యోగా, వ్యాయామం చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. నవ్వకపోతే మనిషిలో మానసిక రుగ్మతలు పెరిగిపోతాయి. మనసును ప్రశాంతంగా ఉంచి జీవితాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచే మార్గం నవ్వు మాత్రమేనని చెప్పక తప్పదు. అందుకే మనస్ఫూర్తిగా చిరునవ్వుతో పలకరిద్దాం.. చిరకాలం జీవిద్దాం.
మానవ శరీంలో దెబ్బతిన్న కణాలు బాగు చేసే శక్తి కూడా నవ్వుకు ఉంది. నవ్వితే కోపం, భయం, అసూయ, ఆందోళన, ద్వేషం, ఒత్తిడి మాయమవుతాయి. కడుపుబ్బ నవ్వితే 20 నిమిషాలు వ్యాయామంతో సమానం. సుమారు మూడున్నర కేలరీలు ఖర్చు అవుతాయి. ఎప్పుడు నవ్వుతూ ఉండేవారి రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడడం తగ్గుతుంది. గుండె జబ్బులు దూరమవుతాయి. చిరునవ్వు ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. ఒక్కసారి గట్టిగా నవ్వితే శరీరంలోని 108 కండరాలకు శక్తి వస్తుంది. నవ్వు ఒత్తిడి తగ్గించి ఆనందాన్ని పెంచే హార్మోన్‌ను ఎక్కువగా విడుదల చేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ పెంపొందిస్తుంది.
చిరునవ్వే మనిషికి చెరగని ఆభరణం
స్మైల్‌తో అనేక మానసిక
రుగ్మతలు దూరం
నవ్వడం యోగం..
నవ్వకపోవడం రోగం..
నేడు ప్రపంచ చిరునవ్వుల దినోత్సవం