
విశ్రాంత ఉద్యోగుల పోరుబాట..
కాళోజీ సెంటర్ : రెండు, మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి రిటైర్డ్ అయిన వారి ఆర్థిక పరిస్థితి కడు దయనీయంగా మారింది. సర్వీస్‌లో ఉన్నంత కాలం జీపీఎఫ్, పీఎఫ్ రూపంలో పైసాపైసా కూడగట్టుకున్న సొమ్ముతో సొంతిల్లు కట్టుకోవాలని, కూతురు పెళ్లి చేయాలని, ఇతర అవసరాలు తీర్చుకోవాలనుకుంటున్న పలువురి ఆశలు అడియాశలవుతున్నాయి. ఉద్యోగ విరమణ చేసి రెండు సంవత్సరాలు కావొస్తున్నా ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన డబ్బులు ఇంత వరకూ చేతికి రాలేదు. దీంతో కుటుంబ అవసరాలు గడవకపోవడంతోపాటు ఆరోగ్య ఖర్చులకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది నెలల క్రితం ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సంవత్సరం సమయం ఇస్తే విశ్రాంత ఉద్యోగులందరి డబ్బులు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియ నేటికీ ప్రారంభం కాకపోవడం వారిలో ఆశలు సన్నగిల్లుతున్నాయి. కనుచూపుమేరలో బెనిఫిట్స్ వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో మానసిక వేదనకు గురవుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తమ ఫింఛన్ డబ్బులు ఖాతాల్లో జయచేయాలని వేడుకుంటున్నారు.
కోర్టు ఆదేశాలు అమలు చేయాలి..
రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదలలో ప్ర భుత్వం జాప్యం చేయడంతో కొంత మంది విశ్రాంత ఉద్యోగులు కోర్టు ఆశ్రయించారు. స్పందించి కోర్టు.. విశ్రాంత ఉద్యోగులకు ఎనిమిది వారాల్లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని ఆదేశించింది. అయినా ప్రభుత్వం ఇప్పటి వరకూ తమకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదని పలువురు విశ్రాంత ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవే కాకుండా మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి వెంటనే కోర్టు ఆదేశాలు అమలు చేసి బెనిఫిట్స్ విడదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నేటి ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న విశ్రాంత ఉద్యోగులు..
సుమారు రెండు సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈనెల 1వ తేదీన పోరుబాటకు సంబంధించి సన్నాహక సమావేశం కూడా జరిగింది. ఇందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులతో చర్చించి నేడు (ఆదివారం) హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సంఘం బాధ్యులు వెల్లడించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ సాధన సమితి పేరుతో పోరుబాట పట్టనున్నట్లు కన్వీనర్స్ కందుకూరి దేవదాస్, కడారి భోగేశ్వర్ తెలిపారు. బెనిఫిట్స్ సాధన కోసం ఆదివారం ఉద్యమ కార్యాచరణ ప్రకటించనునట్లు వారు తెలిపారు.
కుటుంబ ఖర్చులు, వైద్య అవసరాలకు ఇబ్బందులు
కోర్టు ఆదేశాలు అమలు చేయాలని డిమాండ్

విశ్రాంత ఉద్యోగుల పోరుబాట..