
అంబేడ్కర్ వర్సిటీలో ప్రవేశాలకు 10వ తేదీ గడువు
విద్యారణ్యపురి: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2025–2026 విద్యాసంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 10వరకు గడువు ఉందని, ఇదే చివరి అవకాశమని ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ సర్వీస్ విభాగం డైరెక్టర్ డాక్టర్ వై. వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ లేదా ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ, 10ప్లస్ 2 ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రవేశాలు పొందొచ్చని తెలిపారు. అలాగే, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చని తెలిపారు. బీఏ, బీఎస్సీ, బీటెక్, బీబీఏ విద్యార్థులు ఎంఏ ఇంగ్లిష్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, చరిత్ర, ఎకనామిక్స్, సోషియాలజీ, ఎంఏ జర్నలిజం కోర్సులు కూడా చదువుకునే అవకాశం ఉందన్నారు. బీఎస్సీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఎమ్మెస్సీ మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎన్విరాన్‌మెంట్ సైన్స్‌లో ప్రవేశాలు పొందొచ్చనని తెలిపారు. ఓపెన్ యూనివర్సిటీలో చేరే విద్యార్థులకు రిటైల్ రంగంలో ఉపాధి కల్పించేందుకుగాను ఆర్‌ఏఎస్‌సీఐ సంస్థతో కూడా యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుందన్నారు. విద్యార్థులకు ఒకేషనల్ ట్రైనింగ్‌లో ఆసక్తి ఉంటే రామనందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ కూడా శిక్షణ ఇవ్వనుందని ఆయన తెలిపారు. విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేందుకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఆర్‌ఏవోయూ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు.
ఆరుగురు
పేకాటరాయుళ్ల అరెస్ట్
ఖిలా వరంగల్: ఆరుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.3,200 నగదు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ రమేశ్ తెలిపారు. వరంగల్ శివనగర్‌లోని మసీదు వీధి సమీపంలో ఓ ఇంట్లో ఒక పురుషుడు, ఐదుగురు ట్రాన్స్‌జెండర్లు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు శనివారం ఉదయం ఆ ఇంటిపై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఈసారపు సైదులు, గుగులోత్ రమ, పండిబోతు ప్రత్యూష, గుగులోత్ వంశీక, గుగులోత్ వినజ, గుగులోత్ స్వప్న ఉన్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ రమేశ్ తెలిపారు.
యువకుల మధ్య
ఘర్షణ
రామన్నపేట: వరంగల్ మండిబజార్‌లో యువకుల మధ్య ఘర్షణ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున మండిబజార్‌లోని ఖుర్షీద్ హోటల్‌లో బిర్యానీ తినేందుకు గిర్మాజీపేటకు చెందిన నీలారపు రణవీర్ తన తమ్ముడు సూర్యతో వచ్చాడు. ఆ సమయంలో నితీశ్, తరుణ్, చందుతో పాటు మరికొంత మంది వ్యక్తులు రణవీర్‌పైదాడికి పాల్పడ్డా రు. ఈ దాడిలో రణవీర్‌కు తీవ్ర గాయాలు కాగా ఎంజీఎంలో చికిత్స పొందాడు. ఈ ఘటనలో ఖుర్షీద్‌తోపాటు దాడికి పాల్పడిన యువకులపై కేసు నమోదు చేసినట్లు మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు.