
ఆపన్నహస్తం అందించరూ..
వర్ధన్నపేట: చదువుల తల్లికి లక్ష్మీకటాక్షం కరువైంది. కడు పేదరికంలో జన్మించి ప్రభుత్వ గురుకులంలో కష్టపడి చదివి జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్షలో ర్యాంకు సాధించింది. అయితే ఆ విద్యార్థిని ఉన్నత విద్యనభ్యసించడానికి చేతిలో చిల్లిగవ్వలేని దుస్థితి. తల్లిదండ్రులది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. దీంతో ఆ విద్యార్థినితోపాటు తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు చేయూత ఇవ్వాలని చేతులెత్తి వేడుకుంటున్నారు. వివరాల్లో వెళ్తే.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన ఆనపర్తి యాకాంత, సామ్యూల్ నిరుపేదలు. వీరు జీవనోపాధి కోసం హైదరాబాద్ వలస వెళ్లారు. సామ్యూల్ దివ్యాంగుడు కాగా, యాకాంత ఇళ్లలో పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ దంపతుల కూతురు శ్రుతి నీట్ పరీక్షలో ర్యాంకు సాధించి భధ్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌లో సీటు సాధించింది. అయితే ఆర్థిక కారణాలతో శ్రుతి ఉన్నత చదువు ప్రశ్నార్థకంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై దాతలు స్పందించి తమ కూతురు ఉన్నత చదువుకు చేయూనందించాలని వేడుకుంటున్నారు. దాతలు 8977280508 నంబర్‌లో శ్రుతిని సంప్రదించి ఆర్థిక సాయం అందజేయాలని వారు కోరుతున్నారు.
మెడికల్ సీటు సాధించిన
నిరుపేద విద్యార్థిని
అయితే ప్రవేశానికి చేతిలో
చిల్లిగవ్వలేని దుస్థితి
దాతలు చేయూతనివ్వాలని వేడుకోలు