
నకిలీ కానిస్టేబుల్ అరెస్ట్
జనగామ: ఓ నకిలీ కానిస్టేబుల్‌ను జనగామ పోలీసులు అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి ఫోన్, పోలీస్ ఐడీ కార్డు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సత్యనారాయణరెడ్డి వివరాలు వెల్లడించారు. జనగామకు చెందిన కిరణ్ నాలుగేళ్ల క్రితం పట్టణ పోలీసు వెహికిల్‌పై ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేశాడు. ఇదే సమయంలో మూడేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించిన విషయంలో కేసు నమోదు కావడంతో జైలుకెళ్లాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత తన బంధువు కానిస్టే బుల్ కుమారస్వామి ఐడీని తస్కరించి పెంబర్తి, నెల్లుట్ల ప్రధాన రహదారిపై పోలీసు వేషంలో అర్ధరాత్రి సమయంలో వాహనాల తనిఖీ పేరిట డబ్బులు వసూలు చేశాడు. ఇదిలా ఉండగా కిరణ్ బావ బంధువుపై జనగామకు చెందిన వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేయొద్దంటే రూ.2.50లక్షలు ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు. ఈ ఘటనపై ఎండీ అన్వర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కిరణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ చెప్పారు. కాగా, నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సై భరత్, కానిస్టేబుళ్లు బి.కరుణాకర్, ఎన్.సాగర్, బి.కృష్ణ, పి.చరణ్, ఇ.రాజేశ్, ఎం.మధుసూదన్‌ను ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, సీపీ సన్‌ప్రీత్‌సింగ్ అభినందించారు.
వివరాలు వెల్లడించిన పోలీసులు