
రైతులపై అడవి జంతువు దాడి
కాళేశ్వరం: జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలం సూరారం, బెగ్లూర్ గ్రామశివారు పంట పొలాల్లో పలువురు రైతులపై గుర్తుతెలియని అడవి జంతువు దాడి చేసింది. గురువారం ఉదయం పంటపొలాలకు వెళ్తున్న రైతులు గోల్కొండ రాజయ్య, సూరం స్వరూప, రత్న పోతిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డితోపాటు మరో ఏడుగురుపై నక్క, తోడేలును పోలిన బూడిద వర్ణంలో ఉన్న జంతువు దాడి చేసింది. క్షతగాత్రులు భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, వారం రోజులుగా ఆయా ప్రాంతాల్లో ఆ జంతువు మాటువేసి దాడి చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై అటవీశాఖ రేంజర్ రవికుమార్‌ను ఫోన్‌లో సంప్రదించగా తమ సిబ్బంది ఎంత వెతికినా వర్షం కారణంగా ఆ జంతువు పాదముద్రలు లభించలేదని అన్నారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.