
పండుగ వేళ.. మృత్యు హేల
● రోడ్డు ప్రమాదాల్లో పలువురు దుర్మరణం
జనగామ: దసరా పండుగ వేళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో గురు, శుక్ర వారాల్లో పలువురు దుర్మరణం చెందారు. జనగామ జిల్లా వ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. అతి వేగం, ప్రమాదవ శాత్తు జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి 16 మంది క్షతగాత్రులను తరలించగా, మరో 50 మంది వరకు స్వల్ప గాయాలయ్యాయి. బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో 17 ఏళ్ల యువకుడు, స్టేషన్‌ఘన్‌పూర్ పరిధి రాయగిరి రోడ్డు ప్రమాదంలో 29 ఏళ్ల వ్యక్తి మృతిచెందారు. ఆయా ప్రమాదాల్లో పలు గ్రామాలకు చెందిన వారికి తీవ్ర గాయాలు కాగా, జిల్లా ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు..
బచ్చన్నపేట: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందిన ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. ఎస్సై ఎస్కే అబ్దుల్ హమీద్, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కందుల స్వప్న – గోపి దంపతులకు ముగ్గురు సంతానం కాగా, వారిలో చిన్నవాడు అర్జున్ (17) ట్రిఫుల్ ఈ చదువుతున్నాడు. దసరా పండుగకు స్వగ్రామం వచ్చి రాత్రివేళ తన స్నేహితుడు శివప్రసాద్‌తో కలిసి బైక్‌పై గ్రామం బయటకు వెళ్తుండగా ఆలేరు నుంచి బచ్చన్నపేట వైపు వేగంతో వెళ్తున్న కారు.. ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు ఎగిరి కిందపడ్డారు. తలకు గాయమైన అర్జున్‌ను ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. శివప్రసాద్‌కు కాలు విరిగి గాయాలు కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కారు డ్రైవర్ కాశిబుగ్గకు చెందిన బొచ్చ క్రాంతికుమార్‌పై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మృతుడి బంధువుల రాస్తారోకో
మృతుడు కందుల అర్జున్ బంధువులు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదుట జనగామ – సిద్దిపేట రహదారిపై శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. అర్జున్ మృతికి కారణమైన డ్రైవర్ క్రాంతికుమార్‌ను అదుపులోకి తీసుకోకుండా ఎందుకు వదిలేశారంటూ ఆరోపిస్తూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి జనగామ ఏసీపీ పండేరి చేతన్‌నితిన్ వచ్చి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడడంతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సైలు చెన్నకేశవులు, నరేష్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
యశ్వంతాపూర్‌లో ఒకరు..
జనగామ రూరల్: ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జనగామ జిల్లా యశ్వంతాపూర్ గ్రామ శివారు ఉడుముల ఆస్పత్రి వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రఘునాథపల్లి మండలం ఫతేషాపూర్‌కు చెందిన బండ వీరస్వామి (36) జనగామ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టగా వీరస్వామి అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య స్రవంతి, కుమారుడు కూతురు ఉన్నారు.
ఆటోకింద పడి చిన్నారి..
గూడూరు: ట్రాలీ ఆటో టైర్‌కింద పడి చిన్నారి బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కొల్లాపురంలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో దసరా వేడుకల సందర్భంగా డీజే ట్రాలీ ఆటోను ఓ మలుపు వద్ద వెనక్కి తీస్తుండగా, ఆటో వెనుక సోలం రాజు, రమ్య దంపతుల కుమారుడు సోలం జశ్వంత్ (4) ఉన్నాడు. డ్రైవర్ గమనించకపోవడంతో ట్రాలీ వెనుక టైర్‌కింద పడి బాలుడి మృతిచెందాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు.. మానుకోట ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బాలుడు కన్నుమూశాడు. ట్రాలీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే తన కుమారుడు మృతిచెందాడని, బాలుడి తండ్రి సోలం రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు.
పండుగపూట అత్తగారింటికి వెళ్తూ..
స్టేషన్ ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన కత్తుల సంపత్ (29) యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన గురువారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సంపత్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ, భార్య సౌమ్య, మూడేళ్ల కుమారుడితో అక్కడే నివాసముంటున్నాడు. దసరా పండుగకు అత్తగారి ఊరైన దేవరుప్పుల మండలం కోలుకొండకు భార్య, కుమారుడు, బావమరిదితో కలిసి బైక్‌పై హైదరాబాద్ నుంచి గురువారం సాయంత్రం బయలుదేరాడు. ఈ క్రమంలో రాయగిరి వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న బైక్ ఢీకొట్టడంతో సంపత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో మార్గమధ్యలోనే సంపత్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ధరావత్ తండా వద్ద మహిళ..
మరిపెడ రూరల్: కారు ఢీకొని మహిళ దుర్మరణం చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ధరావత్‌తండా వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నగూడూరు మండలం బావోజీ తండాకు చెందిన బానోతు బుల్లి (45) మరిపెడ మండలంలోని ధరావత్ తండాకు బంధువుల ఇంటికి పండుగకు వెళ్లింది. ఈ క్రమంలో రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా కారు వేగంగా వెళ్తూ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బుల్లికి తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ వాహనంలో చికిత్స నిమిత్తం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.
కొత్తపల్లి వద్ద వృద్ధుడు..
ఎల్కతుర్తి: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధుడు దుర్మరణం చెందిన సంఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ చెరువు కట్ట సమీపంలో ముల్కనూర్ – ఎల్కతుర్తి ప్రధాన రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కోమటిపల్లికి చెందిన వేల్పుల పోచయ్య (60) దసరా పండుగ సందర్భంగా కొత్తపల్లి గ్రామంలో ఉంటున్న తన తమ్ముడు ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా, అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
సైక్లిస్ట్ దుర్మరణం..
నర్సంపేట రూరల్: సైకిలిస్ట్‌ను ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఉప్పరపల్లి – కోనాపురం ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన మరాఠీ బీరయ్య (45) గొర్రెలను సాదుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన వృత్తిలో భాగంగా గొర్రెలను మేతకు తీసుకెళ్లి సాయంత్రం షెడ్‌లో వాటిని వదిలి సైకిల్‌పై చెన్నారావుపేటకు వెళ్తుండగా, ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దాంతో బీరయ్యకు తీవ్రగాయాలు కాగా, 108లో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బీరయ్య మృతిచెందాడు.
దుర్గంపేటలో ఒకరు..
ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయాలపాలైన సంఘటన హనుమకొండ జిల్లా దామెర మండలంలోని దుర్గంపేటలో ఆత్మకూరు పీఎస్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సంతోష్, స్థానికుల కథనం ప్రకారం కాజీపేట మండలం తరాలపల్లికి చెందిన అరూరి అశోక్ (28) తన బంధువు దామెర మండల కేంద్రానికి చెందిన వేల్పుల రాజ్‌కుమార్ బైక్‌పై ఊరుగొండలో బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి హనుమకొండ వైపు వస్తుండగా సెల్‌ఫోన్ కిందపడిపోయింది. దాన్ని తీసుకోవడానికి బైక్‌ను వెనుకకు తిప్పుతున్న క్రమంలో వెనుక నుంచి వస్తున్న తక్కల్ల చరణ్ ఢీకొట్టాడు. దాంతో అరూరి అశోక్ అక్కడికక్కడే మృతిచెందగా వెనుక కూర్చున్న రాజ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. చరణ్‌కు కూడా తీవ్రగాయాలు కాగా, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. మృతుడి అన్న రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంతోష్ వివరించారు.

పండుగ వేళ.. మృత్యు హేల

పండుగ వేళ.. మృత్యు హేల

పండుగ వేళ.. మృత్యు హేల

పండుగ వేళ.. మృత్యు హేల

పండుగ వేళ.. మృత్యు హేల

పండుగ వేళ.. మృత్యు హేల

పండుగ వేళ.. మృత్యు హేల

పండుగ వేళ.. మృత్యు హేల