
నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం
వెన్నెముక, నడుం జాగ్రత్త..
ఖిలా వరంగల్: ద్విచక్ర వాహనం అందరికీ నిత్యవసరంగా మారింది. వాహనం నడపడంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే ఆరోగ్యపరంగా నష్టపోక తప్పదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, ఇతర పనుల రీత్యా బైక్‌లు నడిపేవారు అధికంగా మెడ, కండరాలు, మణికట్టు, వెన్నెముక నొప్పులతో ఎక్కువగా బాధపడుతున్నారు.
కొద్దిపాటి జాగ్రత్తలతో సేఫ్..
బైక్ నడిపేటప్పుడు ప్రధానంగా గేర్లు, బ్రేకుల విషయంలో ఒక ప్రణాళిక ఉండాలి. చాలా మంది ఇష్టానుసారంగా బ్రేకులు, క్లచ్‌లు వేయడం చేస్తుంటారు. ఒక్కోసారి బ్రేకులు, గేర్లు పడకపోతే బలవంతంగా కాలిమడమలతో అదుముతారు. దీనివల్ల కాలిమడమలో ఉండే కండరాలు, చేతివేళ్లలో ఉండే కండరాలపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా కండరాల సమస్య వస్తుంది. అందుకే గేర్లు, క్లచ్, బ్రేకులు ఒక నిర్దిష్టంగా వేస్తే ఈసమస్య తలెత్తదు.
కిక్‌తో జాగ్రత్త ..
● వాహనాన్ని కిక్‌తో స్టార్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చాలామంది నిర్లక్ష్యంగా. మొరటుగా కాలితో స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. దీని వల్ల మోకాళ్లపై ప్రభావం పడి నొప్పులు బారినపడతారు. అందుకే జాగ్రత్తగా కిక్ కొడితే ఎటువంటి సమస్య తలెత్తదు.
వెనక్కి చూడడం తగ్గించాలి..
● చాలా వాహనాలకు సైడ్ మిర్రర్లు ఉండవు. ఏ వాహనం వస్తుందో అని చాలా సార్లు పక్కకు, వెనక్కు చూస్తుంటారు. ఇలా చేయడం వల్ల కండరాలు తీవ్ర మైన ఒత్తిడికి గురవుతాయి. తద్వారా మెడ, తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల బైక్‌కు సైడ్ మిర్రర్లు అమర్చుకోవడం మంచిది.
అదేపనిగా యాక్సిలేటర్ ఇవ్వొద్దు..
● ట్రాఫిక్‌లో వాహనం నిలిపినప్పుడు, జంక్షన్‌లో సిగ్నల్ పడిన వెంటనే వెళ్లిపోవాలని ఇంజన్ ఆపకుండా యాక్సిలేటర్‌ను పదేపదే ఇవ్వడం సరికాదు. ఇలా చేయడం వల్ల మణికట్టుపై ప్రభావం పడుతుంది. అదేపనిగా క్లచ్ నొక్కడం వల్ల బొటన వేలు, చూపుడు వేలు మధ్య భాగంలోని కండరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది.
మేలు చేసే వ్యాయామం ఇలా..
● ద్విచక్ర వాహనం నడిపే ప్రతిఒక్కరూ చిన్నపాటి వ్యాయామాలు చేయడం ఉత్తమం. దీని వల్ల శరీర భాగాలను బలంగా మార్చుకోవచ్చు. ఉదయం పూట వాకింగ్, చిన్నపాటి కండరాల వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి. నడుముకు సంబంధించిన వ్యాయామాలు కూడా చేయాలి. అంతేకాకుండా వీలైనంత వరకు 40 నుంచి 30 కిలో మీటర్ల స్పీడ్‌తో వాహనం నడపాలి. ప్రతి అరగంట నుంచి గంట మధ్యలో బైక్‌ను ఆపి ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. సామగ్రి వాహనం వెనుక కట్టుకుంటే మేలు. పక్కకు కట్టుకుంటే వాహనం నడిపేటప్పడు శరీరంపై భారం పడుతుంది.
వరంగల్ నగరానికి చెందిన ఓ యువకుడు ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ప్రమోటర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా వెన్నెముక నొప్పితో బాధపడుతున్నాడు. పెయిన్ కిల్లర్ మాత్రలు వేసుకున్నా ప్రయోజనం లేకపోవడంతో వైద్యుడిని సంప్రదించాడు. ఇంకేముంది వెన్నెముక నొప్పికి ద్విచక్రవాహనమే కారణమని డాక్టర్ తేల్చిచెప్పారు. అవాక్కయిన ఆ యువకుడు వేల రూపాయలు ఖర్చుచేసి ఫిజియోథెరపీ ద్వారా చికిత్స పొందాడు. ఇలా ఆ వ్యక్తే కాదు.. నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక మంది వాహనదారులు ఈ అవస్థలు పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం బైక్ నడపడంలో నిర్లక్ష్యమేనని వైద్యులు చెబుతున్నారు.
ద్విచక్రవాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే వెన్నెముక, నడుము దెబ్బతినే అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాహనం ఎప్పుడూ కండిషనల్‌లో ఉంచుకోవాలి.
చాలా మంది యువకులు బైక్ హ్యాండిల్స్ మార్చేస్తుంటారు. దీనివల్ల వాహనం పడిపేటప్పుడు చేతులు, భుజాల మధ్య కోణం తగ్గిపోతుంది. దీని ప్రభావం వెన్నెముకపై పడుతుంది.
వాహనం నడిపేటప్పుడు స్పీడ్‌బ్రేకర్ల వద్ద జాగ్రత్తగా వెళ్లాలి. లేకుంటే వెన్నెముక దెబ్బతినే అవకాశం ఉంది. 40 కిలోమీటర్ల వేగంతో స్పీడ్ బ్రేక్ దాటిస్తే వెన్నెముక, నడుంపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. గుంతల్లో జాగ్రత్తగా బండి దింపినా బ్యాక్‌పెయిన్ వచ్చే ప్రమాదం ఉంది. బైక్ పార్కింగ్ సమయంలో వివిధ కారణాలతో వాహనాన్ని వెనక్కి ముందుకు అధికంగా లాగకూడదు. దీనివల్ల వెన్ను నొప్పి వచ్చే ఆవకాశం ఉంది. రాత్రి పూట ఇంటి వద్ద బండి పార్కింగ్ చేసేటప్పుడు మెయిన్ స్టాండ్ వేసుకోవాలి. మిగతా సమయాల్లో చాలా వరకు సైడ్ స్టాండ్ వేస్తే వెన్నెముకపై భారం తగ్గుతుంది.
బైక్ వేగం తగ్గిస్తేనే క్షేమంగా గమ్యం
గేర్లు, క్లచ్, బ్రేకులు నిర్దిష్టంగా వేయాలి
జాగ్రత్తలు పాటించకుంటే
అనారోగ్య సమస్యలు

నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం