
పలువురి బలవన్మరణం
ఖిలా వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురు, శుక్ర వారాల్లో వివిధ కారణాలతో పలువురు బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్యం, వ్యక్తిగత కారణాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్ అబ్బనికుంట మైసమ్మ దేవాలయం సమీపంలో రైల్వే ట్రాక్‌పై గురువారం చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజు కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమిట్ట గ్రామానికి చెందిన దాసరి అజిత్‌కుమార్ (30) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం రైలుకింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య దాసరి నవ్యకు అజిత్ మృతదేహాన్ని అప్పగించినట్లు రాజు తెలిపారు.
వివాహిత ఆత్మహత్య
బచ్చన్నపేట: భార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగా వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామన్ చర్ల గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త రమ్య (28) భర్త రాజు జీవనోపాధి కోసం ముంబాయికి వెళ్లి ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. వారికి ఇద్దరు కుమారులు. ఈ క్రమంలో ఇంట్లో గొడవ కారణంగా రమ్య తమ ఇంటిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మృతితో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సమాచారం అందుకున్న ఏసీపీ పండేరి చేతన్‌నితిన్, ఎస్సై అబ్దుల్ హమీద్.. ఘటనా స్థలానికి చేరుకొని పర్యవేక్షించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఉరేసుకొని కూలీ..
మడికొండ: ఉరి వేసుకొని కూలీ బలవన్మరణానికి పాల్పడిన సంఘటన హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్దెల హరీష్ (32) కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. కొద్ది రోజులుగా తాగుడుకు బానిసయ్యాడు. దసరా పండుగకు అతడి భార్య తన తల్లిగారింటికి వెళ్లింది. శుక్రవారం ఉదయం తల్లి శారదను మందు తాగడానికి డబ్బులు అడగగా, ఆమె తన వద్ద లేవని చెప్పడంతో ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో హరీష్ ఉరేసుకున్నాడు. తల్లి శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజ్‌కుమార్ వివరించారు.

పలువురి బలవన్మరణం