
కనుమరుగవుతున్న నువ్వుల పంట!
చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు
మూడు రకాల నువ్వులు..
దంతాలపల్లి: ప్రజలకు ఆరోగ్యకరమైన వంట నూనె అందించే నువ్వుల పంట సాగు కనుమరుగవుతోంది. దీంతో మార్కెట్‌లోకి కల్తీ వంట నూనెలు వస్తున్నాయి. ఆ నూనె వాడిన ప్రజలు రకరకాల జబ్బులతో ఆస్పత్రుల పాలవుతున్నారు. కాగా, వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే నువ్వుల పంటను రైతులు సాగు చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
సాగుతో లాభాలు..
నువ్వుల పంటసాగుతో ప్రజలకు అనేక లాభాలు ఉన్నాయి. రైతులు తాము పండించిన నువ్వులతో పాటు వేరుశనగలను కలిపి గానుగ పట్టించుకొని కల్తీలేని నూనెను ఆహారపదార్థాల్లో వాడేవారు. అలాగే నువ్వుల విక్రయం ద్వారా లాభాలు గడించేవారు. నువ్వులు విరివిగా పండిన సమయంలో సామాన్య ప్రజలకు కూడా కల్తీ లేని వంట నూనెలు చౌక ధరల్లో అందుబాటులో ఉండేవి. నువ్వుల నూనె వాడిన ప్రజలు పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉండేవారు.
అధికారుల పర్యవేక్షణ కరువు..
నువ్వుల పంటసాగుపై వ్యవసాయశాఖ అధికారుల పర్యవేక్షణ కరువైంది. అన్ని పంటలకు సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు నువ్వుల పంటసాగుకు మాత్రం ఇవ్వడం లేదు. రైతులకు పంట ఉపయోగం, వచ్చే ఆదాయంపై అధికారులు కనీస అవగాహన కల్పించడం లేదు. దీంతో పంట సాగుపై రైతులు మక్కువ చూపడం లేదు. అధునాతన పద్ధతుల్లో వంగడాలను అభివృద్ధి చేసి సబ్సిడీలో విత్తనాలు పంపిణీ చేయకపోవడంతో రైతులు నువ్వుల సాగుపై దృష్టిసారించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా, రైతులు పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటల సాగుపైనే ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటికై నా నువ్వుల పంట సాగుపై అవగాహనతో పాటు రైతులను ప్రోత్సహించాలని పలువురు కోరుతున్నారు.
ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన వంట నూనెను అందించే నువ్వుల పంటసాగు విస్తీర్ణం పెరిగేలా ప్రభుత్వాలు, వ్యవసాయశాఖ అధికారులు చొరవ చూపాలి. ఇతర పంటల వంగడాలను అభివృద్ధి చేసిన విధంగా నువ్వుల వంగడాలను అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులో ఉంచాలి.
– గుర్రాల వీరారెడ్డి, రైతు, బొడ్లాడ
ప్రజలకు దొరకని
స్వచ్ఛమైన వంటనూనె
పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించని వ్యవసాయ శాఖ అధికారులు
నువ్వుల పంట సాగులో ప్రధానంగా మూడు రకాల విత్తనాలు ఉంటాయి. వాటిలో నల్లనువ్వులు, తెల్లనువ్వులు, రాగినువ్వులను రైతులు పండించేవారు. కాగా 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది.

కనుమరుగవుతున్న నువ్వుల పంట!