
పురుగుమందుల స్ప్రేలో అవగాహన తప్పనిసరి
ఎంత మోతాదులో వాడాలో తెలుసుకోవాలి
మహబూబాబాద్ రూరల్: ప్రస్తుతం వ్యవసాయ పనులకు కూలీలు సకాలంలో దొరక్కపోవడం, కూలి రేట్లు అధికంగా ఉండడం వల్ల రైతులు ఎక్కువగా కలుపు నిర్మూలన మందులు వాడుతున్నారని మల్యాల కేవీకే శాస్త్రవేత్త బి.క్రాంతికుమార్ అన్నారు. ఈక్రమంలో కలుపు మందుల వాడకంపై అవగాహన లేకపోవడం వల్ల కలుపు నివారణ సరిగా జరగక పోగా, పంట దెబ్బతినడం, కొన్ని సందర్భాల్లో పక్కనున్న పంట పొలాల్లో నష్టం వాటిల్లడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. కలుపు మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.
కలుపు మందులు ఏ పైరుకు, ఏ సమయంలో, ఎంత మోతాదులో వినియోగించాలనే విషయాన్ని తెలుసుకున్న అనంతరమే వాడాలి.
కొన్ని రకాల కలుపు మందులు నేలలో తగినంత తేమ ఉంటేనే పనిచేస్తాయి.
సాగు నీటిలో కలుపు మందులు కలుపరాదు.
ఏ పైరుకు ఏ కలుపు మందు సిఫార్సు చేస్తే దాన్ని మాత్రమే ఆ పైరులో వాడాలి.
వ్యవసాయ శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన మోతాదు కంటే ఎక్కువ వాడరాదు.
మోతాదు మించితే పైరు కూడా నష్టపోవచ్చు.
మందు చల్లిన తరువాత కనీసం ఏడు లేదా ఎనిమిది గంటల లోపు వర్షం కురిస్తే మందు ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది.
కాల పరిమితి దాటిన మందులను వాడరాదు.
కలుపు నాళినులు వాడేందుకు ప్రత్యేకంగా ఒక స్ప్రేయర్ వాడడం మంచిది.
అది వీలు కానప్పుడు చల్లిన తరువాత ఎప్పటికప్పుడు స్ప్రేయర్‌ను సబ్బు నీటితో శుభ్రం చేయాలి.
కలుపు నాళిని అవశేషాలు లేకుండా చేయాలి.
సాధ్యమైనంత వరకు కలుపు మందులను హ్యాండ్ స్ప్రేయర్‌తోనే స్ప్రే చేయాలి.
స్పష్టమైన సూచన లేనిదే కలుపు మందును పురుగు, తెగుళ్ల మందులతో కలపరాదు.
గాలి వేగంగా వీచేటప్పుడు కలుపు మందులు చల్లితే పక్క పొల్లాలో పైరు నష్టపోయే అవకాశం ఉంటుంది. గాలి లేనప్పుడు మాత్రమే చల్లాలి.