
రైతువేదికకు రంగు పడింది!
కాజీపేట అర్బన్: కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలోని రైతు వేదికకు రంగు పడింది అంటూ రైతులు ముక్కున వేలేసుకుంటున్నారు. 2021లో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో రూ.22 లక్షల వ్యయంతో రైతువేదిక నిర్మించారు. క్లస్టర్‌పాయింట్ రైతులను సంఘటితం చేసేందుకు, సమావేశాలు, పంటల్లో మెళకువలను నేర్పించేందుకు రైతువేదికను కొద్ది రోజులు ఉపయోగించారు.
ఫొటోలపై రంగు..
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లు ప్రభావితం కాకుండా రైతు వేదికలో ఏర్పాటు చేసిన నాటి సీఎం, ప్రజాప్రతినిధుల ఫొటోలపై అధికారులు తెల్లటి రంగు వేసి చేతులు దులుపుకున్నారు. నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఫొటోలను మార్చలేదు. అధికారంలో ఎవరు ఉన్నారని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు.
నిర్వహణకు నిధులు లేవు..
కడిపికొండ రైతు వేదికను 2021లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ తరుణంలో నాటి ప్రభుత్వం ప్రతి నెల నిర్వహణ కింద ప్రతి నెల 9వేల రూపాయలను కేటాయించేందుకు నిర్ణయించింది. కాగా, ఒక ఆరు నెలల మాత్రమే రైతు వేదిక నిర్వహణకు నిధులు కేటాయించి తర్వాత నిలిపివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహణ ఊసే ఎత్తకపోవడంతో రైతు వేదికలో ఎన్నికల సమయంలో వేసిన ప్రజాప్రతినిధుల ఫొటోలపై తెల్లటి రంగు అలాగే ఉంది. అదేవిధంగా రైతు వేదికలోని ఫర్నిచర్, ఫ్యాన్లు సైతం పాడైపోయాయి. పట్టించుకునే నాథుడే లేక రైతువేదిక నిర్వహణ అధ్వానంగా మారుతోంది. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకుని రైతు వేదిక నిర్వహణ చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు.