
దసరా ఉత్సవాల్లో అపశ్రుతి
పరకాల : పరకాలలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం నుంచి రాముడి రథాన్ని రాజకీయ నాయకులు, భక్తులు పోటీపడి లాగారు. అయితే కొద్ది దూరంలోని ఆలయ అర్చకుడు రాము ఇంటి ఎదుటకు రాగానే రథాన్ని లాగుతున్న కొందరు రాజకీయ నాయకులు సెల్ఫీలు దిగుతూ.. నానా హడావుడి చేశారు. అదే సమయంలో మూర్తి అనే వ్యక్తి రథాన్ని నెడుతూ వెనుక చక్రం కింద పడిపోయాడు. దీంతో అక్కడే ఉన్న పూజారి కుటుంబ సభ్యులు మహిళలు కేకలు వేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. లేకపోతే హడావుడిలో అతనిపై నుంచి రథం దూసుకెళ్లేది. అప్పటికే అతడి కాలుపై నుంచి రథం వెనుక చక్రం వెళ్లింది. కొందరు భక్తులు చక్రం కింది నుంచి లాగడంతో ప్రాణాపాయం తప్పినట్లయింది. ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రథం చుట్టూ బందోబస్తుతో తీసుకెళ్లారు.
రోడ్డు పైనే క్షతగాత్రుడు..
రథం కింద పడి గాయపడిన మూర్తి రోడ్డుపై తల్లడిల్లుతున్న రాజకీయ నాయకులు, పోలీసులు పట్టించుకోలేదు.. కనీసం 108 వాహనానికి సమాచారం ఇవ్వకపోవడంతో స్థానికులు, పూజారి కుటుంబ సభ్యులు స్పందించారు. బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ద్విచక్ర వాహనంపై పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు.
పరకాలలో రథం కిందపడి
ఒకరికి గాయాలు