
బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి ఒత్తిడి తేవాలి
తొర్రూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు శాసన సభ చేసిన బిల్లును గవర్నర్ ఆమోదించేలా రాజకీయ పార్టీలు ఒత్తిడి తేవాలని కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ కోరారు. డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో మంగళవారం బీసీ సంఘాల నాయకుల సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ వెంకటనారాయణ మాట్లాడుతూ...42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కు పంపి నెలరోజులు గడిచినా ఇంకా చట్టం కాలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా 52 శాతం ఉన్న బీసీలకు న్యాయం జరగలేదన్నారు. ప్రధాని మోదీ బీసీలకు చేసిన న్యాయం ఏమీ లేదని, అగ్రవర్ణాలకు మాత్రం అడగకుండానే 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేన్ అమలు చేస్తున్నాడన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వ్యతిరేకత ప్రదర్శిస్తోందని, 1989లో వీపీసింగ్ ప్రభుత్వం బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే బీజేపీ వ్యతిరేకించిందని గుర్తు చేశారు. బహుజన కులాల ఐక్య వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ చందా మల్లయ్య, బీసీ మేధావుల ఫోరం కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేష్, నాయకులు కంచర్ల వెంకటాచారి, బాతుక బుచ్చిరామయ్య, అంజయ్యలు పాల్గొన్నారు.