
‘డబుల్’ ఇళ్లలోకి వెళ్లేందుకు యత్నం
● అడ్డుకున్న పోలీసులు, అధికారులు
తొర్రూరు: డబుల్ బెడ్రూం ఇళ్లు తమకు కేటాయిస్తారో లేదోనని ఆందోళనకు గురైన కొందరు ఆ ఇళ్లలోకి వెళ్లేందుకు యత్నించారు. డివిజన్ కేంద్రంలోని గోపాలగిరి రోడ్డులోని డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వెళ్లేందుకు మంగళవారం స్థానికులు యత్నించగా పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కొందరు స్థానికులు డబుల్ బెడ్రూం ఇళ్లలోకి ప్రవేశించగా.. మరికొందరు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్, పోలీసులు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. 45 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని, అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయింపునకు కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. దీంతో వారు ఇళ్లు ఖాళీ చేశారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లం అశోక్, యాకూబ్ మాట్లాడుతూ.. తొర్రూరు పట్టణంలోని గోపాలగిరి రోడ్డులో 240 ఇళ్లు నిర్మించి పేదలకు కేటాయించకుండా వదిలేశారని తెలిపారు. నిర్మాణాలు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా పంపిణీ చేయకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి కొమ్మనబోయిన యాకయ్య, నాయకులు డొనుక దర్గయ్య, శోభ, వరలక్ష్మి, షమీనా, అరుణ, రేణుక తదితరులు పాల్గొన్నారు.

‘డబుల్’ ఇళ్లలోకి వెళ్లేందుకు యత్నం