
తండాల్లో బీసీ రిజర్వేషన్లు తొలగించాలి
కురవి: మాతండాలో మా రాజ్యం పేరిట తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయని, మా తండాలో మేమే పాలించుకుంటున్నామని, ఇప్పుడు తండాల్లో బీసీ రిజర్వేషన్లు పెట్టడం అన్యాయమని, వెంటనే తొలగించాలని సేవాలాల్‌సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్ననాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని బలపాల శివారు లింగ్యా తండా గ్రామంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ నందులాల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1997 నుంచి 2014 వరకు మా తండాలో మా రాజ్యం కోసం చేసిన పోరాటం వల్ల 500 జనాభా కలిగిన గూడేలు, తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కుట్రపూరితంగా తండాల్లో స్థానికంగా లేకుండా వేరే గ్రామాల్లో నివాసం ఉంటున్న బీసీలకు రిజర్వేషన్లు కేటాయించడం అన్యాయమని తెలిపారు. రిజర్వేషన్లు తొలగించి లంబాడీ బిడ్డలకు ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాలోత్ లలితా బాయి, మాలోత్ మంజ్యాజీనాయక్, గుగులోత్ రాంలాల్‌నాయక్, సాములు నాయక్, బిక్కు నాయక్, హరినాయక్, సుధాకర్, సుభాష్ నాయక్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.