
875 చెరువుల మత్తడి!
● ఇటీవల కురుస్తున్న వర్షాలతో
నిండిన చెరువులు
● అధికార యంత్రాంగం అప్రమత్తం
● ప్రమాదకరంగా ఉన్న చెరువులు,
కుంటల వద్ద బందోబస్తు
మహబూబాబాద్: ఇటీవల కురుస్తున్న వర్షాలతో జిల్లాలో 875 చెరువులు మత్తడి పోస్తున్నాయి. జిల్లాలో 1,590 చెరువులు ఉండగా.. ఆగస్టులో కొన్ని చెరువులు నిండి మత్తడిపోశాయి. కాగా ఇటీవల కు రుస్తున్న వర్షాలతో మరిన్ని చెరువులు మత్తడి పోస్తు ండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీని లో భాగంగా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటలు వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ శాఖ అధికారులు చెరువులను పరిశీలించి నివేదిక అందజేశారు. అలాగే జిల్లాలో ప్రధానంగా ఉన్న పాకాల, మున్నేరు, ఆకేరు వాగులపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
జిల్లాలో 1590 చెరువులు..
జిల్లాలోని 18 మండలాల్లో 1,590 చెరువులు ఉన్నాయి. వాటిలో 25 నుంచి 50 శాతం నిండిన చెరువులు 12 ఉన్నాయి. అలాగే 50నుంచి 75 శాతం నిండిన 30 చెరువులు ఉన్నాయి. 75నుంచి 100 శాతం నిండినవి 667 ఉండగా మత్తడి పోస్తున్నవి 875 చెరువులు ఉన్నాయని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారుల సూచనల ప్రకారం కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఈనెల 26న జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశారు.
యంత్రాంగం అప్రమత్తం..
భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటలతో పాటు ఆకేరు, పాకాల, మున్నేరు వాగులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వాటి వద్దకు వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖ అధికారుల కలెక్టర్ అప్రమత్తం చేశారు. దీంతో పాటు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. చేపల వేటకు మత్స్యకార్మికులు వెళ్లకుండా వారికి సమాచారం ఇచ్చారు.
దెబ్బతిన్న చెరువులపై
ప్రత్యేక దృష్టి..
ఈమధ్య కాలంలో భారీ వర్షాలతో పలు చెరువులు దెబ్బతిన్నాయి. జిల్లాలో 63 చెరువులు ఎక్కువ దెబ్బతినగా.. 74 చెరువులు స్వల్పంగా దెబ్బతిన్నాయి. రెండు కాల్వలు కూడా దెబ్బతినగా.. మొత్తం 139 జలవనరులకు సంబంధించిన నివేదిక పంపారు. కాగా 86 చెరువులు తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేశారు. 14 చెరువుల పనులు జరుగుతున్నాయి. 16 చెరువుల పనులు పూర్తి కాలేదు. 23 చెరువుల మర్మతుల పనులు మంజూరు కాలేదని అధికారులు తెలిపారు. దీంతో దెబ్బతిన్న చెరువుల పరిస్థితిపై ఆరా తీసి వివరాలు నమోదు చేసుకున్నారు. చెరువుల వద్ద తగు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
మండలం చెరువులు 75–100 మత్తడి
శాతం నిండినవి పోస్తున్నవి
మానుకోట 87 03 84
గూడూరు 122 87 35
చిన్నగూడూరు 24 13 07
దంతాలపల్లి 29 21 07
డోర్నకల్ 69 – 69
మరిపెడ 67 30 37
నర్సింహులపేట 46 28 18
సీరోలు 48 – 48
కురవి 76 – 76
నెల్లికుదురు 58 19 19
కేసముద్రం 53 03 48
ఇనుగుర్తి 28 07 15
గార్ల 96 29 67
బయ్యారం 98 60 38
తొర్రూరు 58 18 26
పెద్దవంగర 37 8 28
కొత్తగూడ 380 251 129
గంగారం 214 90 124
మొత్తం 1,590 667 875