
వలసవాదులం కాదు.. మూలవాసులం
నెహ్రూసెంటర్: లంబాడీలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలసవాదులుగా చిత్రీకరించేందుకు కొందరు పనిగట్టుకుని కుట్రలు చేస్తున్నారని, మేము వలసవాదులం కాదు.. మూలవాసులమని గిరిజన నేతలు పేర్కొన్నారు. లంబాడీ రిజర్వేషన్ పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆదివారం లంబాడీల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడూ.. ఆదివాసీ, లంబాడీల మధ్య చిచ్చుపెట్టేలా కుట్రలు చేస్తున్నారని ఆదివాసీల భుజాలపై తుపాకీ పెట్టి లంబాడీలను కాల్చేలా పతకం వేస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీ, లంబాడీల హక్కుల కోసం కలిసి పోరాటం చేసేందుకు సిద్ధమన్నారు. కొంత మంది జాతి కోసం పోరాటం చేస్తే ఫలాలు పొందుతున్నాం. లంబాడీలను రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టేలా ఎవరు చేసినా.. కాలగర్భంలో కలిపేలా కలిసికట్టుగా ఉండాలి. రాజకీయ అవకాశాలు వస్తే ఒక్కతాటిపై ఉండి జాతి కోసం నిలబడాలని, ఈ ఉద్యమంలో మీతో ఉంటానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. జాతి కోసం జరుగుతున్న పోరాటంలో లంబాడీ ప్రజాప్రతినిధులు కలిసి రావాలన్నారు. రిజర్వేషన్ల కోసం, తండాలను గ్రామ పంచాయతీల కోసం పోరాటాలు చేసి సాధించుకున్నాం. పాలకులు రెచ్చగొట్టి కలిసి ఉన్న ఆదివాసీ, లంబాడీల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారన్నారు. జాతికోసం అందరూ ఐక్యమవుదాం, పార్టీలకు అతీతంగా కలిసివచ్చి రాజ్యాధికార సాధనలో ముందుండాలన్నారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వాలపై పోరాడి హక్కులు సాధించుకోవాలే తప్ప లంబాడీలను రాజకీయం కోసం వాడుకోవాలని చూస్తే వారిని రాజకీయ భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. సేవాలాల్‌సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్‌నాయక్ మాట్లాడుతూ.. రాజకీయాలను పక్కనబెట్టి జాతి మనుగడ సాధించేలా, రాజ్యాధికారం కోసం లంబాడీలంతా ఏకం కావాలన్నారు. హక్కులు, చట్టాలు సాధించుకునేలా పోరాటాలు సాగించాలని, రిజర్వేషన్ కాపాడుకునేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ఎస్టీ జా బితా నుంచి తప్పించే కుట్రలను తిప్పికొట్టేలా ప్రతి ఒక్కరూ పోరాటాల్లో కలిసి రావాలని పిలుపుని చ్చా రు. జేఏసీ చైర్మన్ డాక్టర్ జగదీశ్వర్, వైస్ చైర్మన్ గుగులోత్ కిషన్‌నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో దారావత్ వెంకన్ననాయక్, బోడ లక్ష్మణ్‌నాయక్, గుగులోత్ భీమానాయక్, బోడ రమేష్‌నాయక్, డాక్టర్ రాజ్‌కుమార్‌జాదవ్, హఠ్యానాయక్, డాక్టర్ వివేక్, హరినాయక్, మంగీలాల్, గుగులోత్ రవి, చందులాల్, సిద్దునాయక్, కర్నావత్ వెంకన్న, మాలోత్ రవీందర్, లింగ్యానాయక్ ఉన్నారు.
లంబాడీలు ఐకమత్యంతో
రాజ్యాధికారం సాధించాలి
ఆదివాసీ, లంబాడీల మధ్య
చిచ్చుపెట్టేందుకు కుట్రలు
లంబాడీల ఆత్మగౌరవ సభలో నేతలు

వలసవాదులం కాదు.. మూలవాసులం

వలసవాదులం కాదు.. మూలవాసులం