
సద్దులకు సిద్ధం
● బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు
● కొత్త బజారులో బంధం చెరువు, పాత బజారులో నిజాం చెరువులో నిమజ్జనం
మహబూబాబాద్ అర్బన్: సద్దుల బతుమక్మ వేడుకలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం మానుకోట పట్టణంలో బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్టీఆర్ స్టేడియం, పాత బజారులోని నిజాం చెరువు, కొత్త బజారులోని బంధం చెరువును పరిశీలించారు. బతుకమ్మ నిమజ్జనం సమయంలో ట్రాఫిక్ కంట్రోల్‌కు జిల్లా పోలీస్ యంత్రాంగం బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. చెరువుల సమీపంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్ అధికారులు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొంటారు. కాగా జిల్లాలో పలు చోట్ల సోమవారం, కొన్నిచోట్ల మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించుకునే అవకాశం ఉంది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, డీఈ ఉపేందర్, నాయకులు, మున్సిపల్ ఏఈ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.