
సారథి.. వాహనదారులకు వారధి
దళారుల వ్యవస్థ ఇక కనుమరుగు
ఖిలా వరంగల్ : రవాణా శాఖలో సంస్కరణల శకం మొదలైంది. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న వాహన్ వెబ్‌సైట్‌లోని డేటాబేస్‌తో రవాణాశాఖ అనుసంధానమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖలో తీసుకొచ్చిన సారథి పోర్టల్ విధానాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చి సేవలందిస్తోంది. వరంగల్, హనుమకొండ, జనగామ, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో సారథి పోర్టల్ అమలుకు ఆగస్ట్ 18 తేదీన శ్రీకారం చుట్టారు. పోర్టల్‌లో తలెత్తుతున్న స్వల్ప సాంకేతిక ఇబ్బందులను దశల వారీగా సవరణ చేశారు. ప్రస్తుతం పోర్టల్‌లో నమోదు ప్రక్రియ విజయవంతమవుతోంది. ఇప్పటి వరకు సిటిజన్ ఫ్రెండ్లీ సర్వీస్ ఇన్ ట్రాన్స్‌ఫోర్ట్ డిపార్ట్‌మెంట్(సీఎఫ్‌ఎస్టీ) పోర్టల్ పనిచేయగా ఇకపై దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేస్తున్న పరివాహన్ ద్వారా సేవలు అందనున్నాయి. ఆయా ఆర్టీఏ కార్యాలయాల్లో సేవలు పారదర్శకంగా అందుతున్నాయి.
విదేశాల నుంచైనా అవకాశం..
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన సారథి పోర్టల్ ద్వారా దేశ, విదేశాల నుంచైనా ఆన్‌లైన్‌లోనే ఇంటి నుంచి లైసెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. రోడ్డు భధ్రతపై పరిజ్ఞానం ఉంటే సులభంగా పరీక్ష ఉత్తీర్ణత కావొచ్చూ. కాగా, సారథి పోర్టల్‌తో ఇంటి నుంచే లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందడం, రెన్యువల్, చిరునామా మార్పు వంటి అంశాలకు వీలు కల్పించనున్నారు. ప్రస్తుతం పోర్టల్ ద్వారా లెసెన్స్ తీసుకునే అవకాశం మాత్రమే కల్పించారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకొని విదేశాలకు వెళ్లిన వారి వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించక అక్కడి అధికారులు వాటిని తిరస్కరించిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టొచ్చని ఎంవీఐలు భావిస్తున్నారు. కొత్త విధానంలో సాంకేతిక సమస్యల కారణంగా స్లాట్ బుకింగ్, వా హనదారులు ఆర్టీఏ కార్యాలయం వచ్చిన తర్వాత కొంత ఆలస్యం అవుతోంది. కొన్నాళ్లకు త్వరిగతిన సేవలు అందుతాయని అధికారులు అంటున్నారు. వాహనదారులు rarathiparivahan.gov.in / rarathirervicerలో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇండియాలో ఒకే విధానం..
పరివాహన్ సారథి పోర్టల్ ద్వారా పొందిన లైసెన్స్ ఇండియాలో ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది. రెన్యువల్ టైంలో ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌లో చేసుకునే అవకాశం ఉంది. ఈకార్డు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చెల్లుబాటు అవుతుంది. ఇంతకాలం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర పరిధిలోనే లైసెన్స్ ఉండేది. వివరాలు మరో రాష్ట్రంలో కనిపించేవి కాదు. అంతా గోప్యంగా ఉండేది. కానీ ప్రస్తుతం నూతనంగా వచ్చిన పరివాహన్ సారథి పోర్టల్ ద్వారా క్షణాల్లో వాహనదారుడి వివరాలు చేతికి వస్తాయి.
ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌లు
ఉమ్మడి జిల్లాలో
అందుబాటులోకి పోర్టల్
దేశవ్యాప్తంగా ఒకే పోర్టల్..
ఒకే లైసెన్స్ విధానం అమలు
రోడ్డు భద్రతపై అవగాహన ఉంటేనే డ్రైవింగ్ లైసెన్స్
త్వరలోనే ఆర్టీఏలో దళారుల వ్యవస్థ
కనుమరుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో వాహనదారులు దళారులపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఇంతకాలం ఆర్టీఏలో డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు లర్నింగ్ లైసెన్స్ కావాలన్నా ఎంతో కొంత ముట్టచెప్పాల్సి వచ్చేది. సారథి పోర్టల్ అందుబాటులోకి రావడంతో నిదానంగా ఈ అవినీతి తగ్గుముఖం పడుతోంది. ఆర్టీఏ సేవలు ఇక సులభంగా పొందే అవకాశం ఉన్నా.. చదువుకున్న వ్యక్తికే డ్రైవింగ్ లైసెన్స్ జారీ అయ్యే అవకాశం ఉంది. దీని ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా వాహనదారులు రవాణా సేవలు పొందే వెసులు బాటు వచ్చింది. ఆన్‌లైన్‌లో పరిజ్ఞానం ఉంటే లర్నింగ్ లైసెన్స్ పరీక్ష సులభతరంగా ఉంటుందని రవాణాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం లైసెన్స్‌లకు ధ్రువీకరణ పత్రాల హార్డ్ కాపీ జత చేయాల్సి వస్తోంది. కొత్త విధానంలో సాఫ్ట్ కాపీతో సరిపోతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఆగస్ట్ 18 నుంచి పరివాహన్ సారథి ద్వారా సేవలు అందిస్తున్నారు. రోజుకు 430 మందికి ఆన్‌లైన్‌లో వివిధ లైసెన్స్‌లకు స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి.