
విద్యా రంగంలో కొత్త అధ్యాయం
● రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క
ములుగు: సమ్మక్క, సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయని, విద్యారంగంలో ఈ యూ నివర్సిటీ కొత్త అధ్యాయం సృష్టిస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో పరిధిలోని సాయిబాబా టెంపుల్ రోడ్ శివారులో సమ్మక్క, సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ విశ్వవిద్యాలయ ప్రహరీ నిర్మాణ పనులను మహబూబాబాద్, ఆదిలాబాద్ ఎంపీలు పోరిక బలరాం నాయక్, జి.నాగేశ్, కలెక్టర్ దివాకర టి.ఎస్, వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వైఎల్.శ్రీనివాస్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమ్మక్క, సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుతో ములుగు జిల్లాకు ప్రత్యేక గౌరవం లభిస్తుందని, గిరిజన విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి ఇది బలమైన వేదిక అవుతుందని తెలిపారు. ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉందని, యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు, మౌలిక వసతులు సమకూర్చుతామని పేర్కొన్నారు. స్థానిక విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, యూనివర్సిటీ ఏర్పాటుతో విద్యా రంగం, జిల్లా అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, మాజీ ఎంపీ సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
8 నుంచి మూడేళ్ల ‘లా’ ఐదో సెమిస్టర్ సప్లిమెంటరీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మూడేళ్ల ‘లా కోర్సు ఐదో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 8వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ తెలిపారు. 8న మొదటి పేపర్, 10న రెండో పేపర్,14న మూడో పేపర్, 16న నాలుగో పేపర్, 18న ఐదో పేపర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆయా తేదీల్లో పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయని వారు తెలిపారు.
హన్మకొండ చౌరస్తా: చారిత్రక వేయిస్తంభాల ఆలయ చరిత్రను తెలుసుకునేందుకు ఇక గైడ్ అవసరం లేదు. ఆలయ చిత్రాలు, చరిత్రను క్షుణ్ణంగా వివరించేలా పురావస్తుశాఖ అధికారులు ఆలయ ప్రాంగణంలో క్యూఆర్ స్కానర్లను ఏర్పాటు చేశారు. గూగుల్ క్రోమ్ లోకి వెళ్లి స్కాన్ చేస్తే చాలు చరిత్ర తెలియజేస్తుంది.

విద్యా రంగంలో కొత్త అధ్యాయం