
బతుకమ్మ అంటేనే పూల పండుగ
ఖిలా వరంగల్: బతుకమ్మ అంటేనే పూల పండుగ అని, బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం మనందరిపై ఉందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని చారిత్రక మధ్యకోట ఖుషిమహాల్ మైదానంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పండుగ విశిష్టతను వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచేలా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ కేవలం పూల పండుగ కాదని, ఇది ఆడబిడ్డల ఆశయాల పండుగ, ప్రకృతిని పూజించే పండుగ, భూదేవికి సమర్పించే నైవేద్యమని చెప్పారు. అనంతరం మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సీఎం రేవంత్‌రెడ్డి బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. నగర ప్రజల కోసం 29,30 తేదీల్లో సద్దుల బతుకమ్మ ఆట స్థలాల్లో ఏర్పాట్లు చేశామని, 16 ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బైరబోయిన ఉమ, వేల్పుగొండ సువర్ణ, ముస్కమల్ల అరుణ, పోశాల పద్మ, పల్లం పద్మ, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, తహసీల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ
ఖుష్‌మహల్ మైదానంలో
అంబరాన్నంటిన సంబురాలు

బతుకమ్మ అంటేనే పూల పండుగ