
పెరుగుతూ.. తగ్గుతూ..
● గోదావరి వరద ఉధృతి
వాజేడు: గోదావరి దోబూచులాడుతోంది. శనివారం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఉధృతంగా పెరిగిన గోదావరి వరద 2 గంటల పాటు నెమ్మదించింది. సాయంత్రం 4 నుంచి మళ్లీ పెరుగుతూ రహదారులను ముంచెత్తింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఆదివారం సాయంత్రం 6 గంటలకు 15.890 మీటర్ల మేర పెరిగింది. టేకులగూడెం గ్రామ చివరిలోని జాతీయ రహదారి మళ్లీ ముంపునకు గురి కావడంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పల్లపు ప్రాంతాల నుంచి గోదావరి ప్రవహిస్తుండటంతో మిర్చి పంటలు ఇంకా నీటిలో మునిగి ఉన్నాయి.
సమ్మక్కసాగర్‌లోకి భారీగా వరద నీరు
కన్నాయిగూడెం: నాలుగు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఎగువన ఉన్న బ్యారేజీల నుంచి గోదావరిలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్కసాగర్ బ్యారేజీలోకి ఆదివారం భారీగా వరద నీరు వచ్చి చేరడంతో బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్ర రూపంతో ప్రవహిస్తోంది. ఈ మేరకు బ్యారేజీలోకి ఆదివారం 7,78,600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీకి ఉన్న 59గేట్లను ఎత్తి అదే మోతాదులో నీటిని దిగువకు వదులుతున్నారు.

పెరుగుతూ.. తగ్గుతూ..