
వ్యవసాయ మార్కెట్‌కు సెలవులు
మహబూబాబాద్ రూరల్ : బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా మబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ ఈ నెల 27నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు బంద్ ఉంటుందని, సెలవు రోజుల్లో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ శుక్రవారం తెలిపారు. మార్కెట్ యార్డు వచ్చే నెల 6వ తేదీన పునఃపారంభం అవుతుందన్నారు.
అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్
నెహ్రూసెంటర్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎన్‌హెచ్‌ఎం పరిధిలో నిలిచిపోయిన ఎన్‌హెచ్‌ఎం స్టాఫ్‌నర్సు 2, ఎన్‌సీడీ స్టాఫ్‌నర్సు 10, ఎంఎల్‌హెచ్‌పీ 10 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగ 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. కాగా, వెరిఫికేషన్‌కు హాజరు కాని అభ్యర్థులకు రెండో విడత కౌన్సెలింగ్ ద్వారా మరోసారి సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు. డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్, జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ రజిత అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను పరిశీలించారు.
ప్రయాణికులకు ఆర్టీసీ దసరా బహుమతులు
నెహ్రూసెంటర్: బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రయాణిలు లక్కీడ్రా ద్వారా నగదు బహుమతులు పొందవచ్చని ఆర్టీసీ డీఎం వి.కల్యాణి శుక్రవారం తెలిపారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు సెమి డీలక్స్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ, లహరి, ఏసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు టికెట్ వెనుకాల పేరు, ఫోన్ నంబర్, చిరునామా రాసి మహబూబాబాద్ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన లక్కీడిప్ బాక్సులో వేయాలన్నారు. అక్టోబర్ 8న హనమకొండ రీజనల్ కార్యాలయంలో అధికారుల సమక్షంలో లక్కీడ్రా తీయబడుతుందన్నారు. ముగ్గురు విజేతలకు మొదటి బహుమతి రూ.25,000, రెండో బహుమతి రూ.15,000, మూడో బహుమతి రూ. 10,000 నగదు అందజేస్తామన్నారు. మహబూబాబాద్ నుంచి హైదరాబాద్‌కు దసరా స్పెషల్ 10 బస్సులను నడుపుతున్నామని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని డీఎం సూచించారు.
మద్యం షాపుల నిర్వహణకు గెజిట్ విడుదల
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
మహబూబాబాద్ రూరల్: మద్యం షాపుల ఏర్పాటునకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా పరిధిలో 2025–2027కు గానూ మద్యం షాపుల ఏర్పాటు కోసం ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైందని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి.కిరణ్ తెలిపారు. జిల్లాలో 59 మద్యం షాపులు ఉండగా ప్రభుత్వం అదనంగా రెండు షాపులను ఏర్పాటు చేసేందుకు ఆదేశాలు జారీ చేయడంతో సంఖ్య 61కి చేరిందన్నారు. గౌడ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ కేటగిరీల వారికి నిర్ణయించిన షాపుల రిజర్వేషన్ల ఆధారంగా దరఖాస్తులు సమర్పించవచ్చని ఆయన పేర్కొన్నారు.

వ్యవసాయ మార్కెట్‌కు సెలవులు