
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
మహబూబాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌తో కలిసి భారీ వర్షాలపై అన్ని విభాగాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న రెండు మూడు రోజుల్లో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచన ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెరువులు, వాగులు, వంకలు, కుంటలు, జలపాతాలు ప్రమాదస్థాయిలో ఉన్నందున అటువైపు ప్రజలు వెళ్లకుండా తగు చర్యలు చేపట్టాలన్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. జిల్లాలో ప్రవహించే పాకాల, మున్నేరు, ఆకేరు తదితర వాగులను నిత్యం పరిశీలిస్తూ ఉండాలని ఆదేశించారు. జిల్లాలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశామని వర్షాలు, వరదల వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగితే వెంటనే కంట్రోల్‌రూం 7995074803 నంబర్‌లో సంప్రదించాలన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్‌కుమార్, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీపీఓ హరిప్రసాద్, కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి..
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు నిబద్ధతతో పనులు చేపట్టాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణపై మాస్టర్స్ ట్రైనర్స్‌తో అధికారులకు శిక్షణ తరగుతులు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్ట మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించిన విధంగా అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలన్నారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి సందేహాలు ఉన్నా మాస్టర్ ట్రైనర్స్‌తో నివృత్తి చేసుకోవాలని ఆదేశించారు. నోటిఫికేషన్ జారీ చేసిన తక్షణమే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. వాటిని పూర్తిగా పరి శీలించి ఆమోదించాలా.. తిరస్కరించాలా అనే విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పోలింగ్, కౌంటింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జెడ్పీ సీఈఓ పురుషోత్తం పాల్గొన్నారు.