
తోటి తెగ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
గీసుకొండ: రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దూరంగా ఉంటున్న ఆదివాసీ తోటి తెగ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఆదివాసీ తోటి తెగ సేవా సంఘం(ఏటీటీఎస్‌ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం కమలమనోహ ర్ డిమాండ్ చేశారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ జాన్‌పాకలోని తోటి తెగ జిల్లా సంఘం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీ నిర్మాణ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీల్లో 9 తెగలు ఉండగా అందులో చెంచు, కొలం, తోటి, కొండరెడ్డి తెగలు అన్ని రకాలుగా అవకాశాలు లేక వెనుకపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగు తెగలతో ఆదివాసీ తెగల ఐక్య వేదికను ఏర్పాటు చేసి రాజ్యాంగంలో కల్పించిన హక్కుల కోసం పోరాడుతామన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్డు ద్వారా చేస్తున్న పోరాటానికి తమ సంఘం మద్దతుగా నిలుస్తుందన్నారు. తోటి తెగ విద్యార్థులు, యువత బాగా చదవి జీవితంలో ఉన్నతంగా రాణించాలని పిలుపునిచ్చారు.
ఏటీటీఎస్ రాష్ట్ర కమిటీ ఎన్నిక
ఆదివాసీ తోటి తెగ సేవా సంఘం రాష్ట్ర నూతన కమిటీని ఏర్పాటు చేశారు. సంఘం గౌరవ అధ్యక్షుడిగా షెడ్మాకి సంజీవ్ (హైదరాబాద్), అధ్యక్షుడిగా ఆత్రం కమలమనోహర్ (కరీంనగర్), ప్రధాన కార్యదర్శిగా గుర్రం రఘు (వరంగల్), ఉపాధ్యక్షుడిగా ఆత్రం జగన్ (నిజామాబాద్), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కుర్రెంగ వేణు(జగిత్యాల), కోశాధికారిగా షెడ్మాకి భిక్షపతి (కరీంనగర్), వర్కింగ్ కార్యదర్శిగా సోయం రమేశ్ (సిద్దిపేట), సహాయ కార్యదర్శిగా గుర్రాల సమ్మయ్య (పెద్దపల్లి), సంయుక్త కార్యదర్శిగా సోయం శరత్‌బాబు (భూపాలపల్లి)తో పాటు పలువురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది.
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి
ఏటీటీఎస్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
ఆత్రం కమలమనోహర్