
దేశ సమగ్రతకు ఐకమత్యమే చిహ్నం
● ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
పర్వతగిరి: దేశ సమగ్రతకు ఐకమత్యమే మహాబలమని కవి, గాయకుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కవుల అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. మన దేశంలో కులాలు, మతాలకు అతీతంగా ఎందరో మతగురువులు, సూఫీలు సహజీవన సంస్కృతిని చాటి చెప్పారని అన్నారు. కలిసి కట్టుగా ఉంటూ మత సామరస్యాన్ని కాపాడాలని ఆకాంక్షించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ గోరటి వెంకన్నకు డాక్టరేట్ ప్రకటించిన సందర్భంగా కవులు ఘనంగా సన్మానించారు. అనంతరం డాక్టర్ జిలుకల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రతీక అన్నారం యాకుబ్‌బాబా దర్గా అన్నారు. అలయ్ బలయ్ కల్చర్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బుద్దిజీవులుగా ఆ గంగా జమున సంస్కతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో కవి యాకుబ్, కవి విమర్శకుడు లక్ష్మీనర్సయ్య, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కవి ప్రసేన్, స్కైలాబ్, జిలుకర శ్రీనివాస్, తాళ్లపల్లి యాకమ్మ, బండారి రాజ్‌కుమార్, వడ్లకొండ దయాకర్, రాపాక శ్రీనివాస్, కేతిరెడ్డి యాకుబ్‌రెడ్డి, చిట్ల ప్రేమ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.