
అవసరాల మేరకు యూరియా పంపిణీ
మహబూబాబాద్ రూరల్: రైతుల పంటల సాగు అవసరాల మేరకు యూరియా పంపిణీ జరుగుతుందని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా పంపిణీ ప్రక్రియను గురువారం డీఎస్పీ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలను పరిశీలించి, వారు సాగు చేస్తున్న పంటల వివరాల ఆధారంగా వ్యవసాయ అధికారులు టోకెన్లు జారీ చేస్తున్నారన్నారు. రైతులకు ఇచ్చిన టోకెన్లను తీసుకుని వచ్చి వారికి కేటాయించిన రైతు వేదికలు, సొసైటీ కేంద్రాల వద్ద యూరియా బస్తాలు తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్సై ప్రశాంత్ బాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రైతుల బారులు..
కురవి: మండల కేంద్రంతోపాటు నేరడ, గుండ్రాతిమడుగు(విలేజి), బలపాల, సీరోలు మండలం కాంపల్లి, కొత్తూరు(సీ) స్టేజీ వద్ద యూరియా పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. యూరియా టోకెన్ల కోసం రైతులు రైతు వేదికల వద్ద బారులుదీరారు. పోలీసుల బందోబస్తు నడుమ రైతులకు యూరియా పంపిణీ జరిగింది. కొత్తూరు(సీ) స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన సేల్ పాయింట్‌ను డీఏఓ విజయనిర్మల పరిశీలించారు. ఆమె వెంట సీరోలు ఏఓ చాయారాజ్ తదితరులు పాల్గొన్నారు.
బయ్యారంలో..
బయ్యారం: మండలంలోని బయ్యారం, కొత్తపేట, ఉప్పలపాడు, రామచంద్రాపురంలో గురువారం యూరియా పంపిణీ నిర్వహించగా రైతులు అధికసంఖ్యలో పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చారు. పట్టాదారు పాసుపుస్తకం ఆధారంగా ప్రకటించిన పేర్లకే యూరియా ఇస్తామని తెలుపుతుండగా.. అదును తీరిన తర్వాత తమకు యూరియా ఇస్తే ప్రయోజనం ఉండదని, ఇప్పుడే ఇవ్వాలని మిగతా రైతులు అధికారులతో వాదనకు దిగుతున్నారు.

అవసరాల మేరకు యూరియా పంపిణీ

అవసరాల మేరకు యూరియా పంపిణీ