
మహబూబాబాద్: వయోవృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఒక వయోవృద్ధుల మల్టీ సర్వీస్ డే కేర్‌సెంటర్ మంజూరు చేసింది. సెంటర్ ఏర్పాటు కోసం జిల్లా సంక్షేమశాఖ అధికారులు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను పరిశీలిస్తున్నారు. సెంటర్ నిర్వహణ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. కలెక్టర్ సమక్షంలో ఇంటర్వ్యూ ద్వారా నిర్వాహకుడిని ఎంపిక చేయనున్నారు. కాగా, సెంటర్ మంజూరుపై వయోవృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాలక్షేపం కోసం..
అరవై ఏళ్లు దాటిన వయోవృద్ధుల కాలక్షేపం కోసం జిల్లాకు ఒక సెంటర్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. సెంటర్ నిర్వహణకు ఖాళీ ప్రభుత్వ భవనాలను ఎంపిక చేయాలని ఉన్నతాధికారులు జిల్లా సంక్షేమశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో సీడీపీఓ శిరీష, డీఈఓ దక్షిణామూర్తి ఎంఈఓ వెంకటేశ్వర్లుతో కలిసి పాత డీఈఓ కార్యాలయం భవనాన్ని పరిశీలించారు. దీంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల భవనాలను పరిశీలించినప్పటికీ.. పాత డీఈఓ కార్యాలయ భవనమే అనుకూలంగా ఉందని, అదే ఖరారు కానున్నట్లు పేర్కొన్నారు.
పలు ఏర్పాట్లతో పాటు స్నాక్స్..
సెంటర్‌లో క్యారంబోర్డుతో పాటు చెస్, న్యూస్ పేపర్లు, ఇతర పుస్తకాలు అందుబాటులో ఉంచుతారు. ఉదయం 9నుంచి సాయంత్రం 6గంటల వరకు సెంటర్ తెరిచి ఉంచుతారు. వయోవృద్ధులకు స్నాక్స్ సైతం ఇవ్వనున్నారు. సెంటర్‌లో సూపరింటెండెంట్‌కు నెలకు రూ.10,000, సోషల్ వర్కర్‌కు రూ.5,000, వంట మనిషికి రూ.5,000 ఇతర వర్కర్‌కు రూ.8,000 చొప్పున కేంద్ర ప్రభుత్వమే వేతనాలు చెల్లిస్తుంది. ప్రభుత్వ భవనాలు అనుకూలంగా లేకుంటే, అద్దె భవనం కోసం నెలకు రూ,5,000 అద్దె చెల్లిస్తుంది. వారంలో ఒక రోజు ప్రభుత్వ వైద్యుడు సెంటర్‌కు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తాడు.
బ్లాక్ లిస్టులో ఉంటే తిరస్కరణ..
సీనియర్ సిటిజన్, ఎన్జీఓలు బ్లాక్ లిస్టులో ఉన్నా, ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులో ఉంటే వారి దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. కాగా నిబంధనలన్నీ పరిశీలించి డీడబ్ల్యూఓ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కాగా జిల్లా జనాభాలో వయోవృద్ధులు 20శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. సీనియర్ సిటిజన్ అసోసియేషన్‌లో 900 మంది వయోవృద్ధులు సభ్యులుగా ఉండగా పదవీ విరమణ పొంది పెన్షన్ తీసుకునే వారు వందల సంఖ్యలో ఉన్నారు.
ఎంపిక కోసం ప్రత్యేకంగా కమిటీ..
నిర్వాహకుడి ఎంపిక కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, సభ్యులుగా డీఆర్‌డీఏ, డీఎంహెచ్‌ఓ, ఒకరు సీనియర్ సిటిజన్, కన్వీనర్‌గా డీడబ్ల్యూఓ ఉంటారు. కమిటీ సభ్యులు దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆ తర్వాత కలెక్టర్ సమక్షంలో ఇంటర్వ్యూ నిర్వహించి నిర్వాహకుడిని ఎంపిక చేస్తారని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ అంతా వేగవంతం చేశారు.
సెంటర్ నిర్వహణ బాధ్యతలను ఎన్జీఓ(నాన్ గవర్నమెంట్ ఆర్గనేజేషన్), సీనియర్ సిటిజన్‌లకు అప్పగిస్తారు. అందుకు ఈనెల 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. ఈనెల 25(గురువారం)వరకు మాత్రమే గడువు ఇచ్చింది. డీడబ్ల్యూఓ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. దరఖాస్తు చేసుకునే వారు తెలంగాణ సొసైటీ రిజిస్ట్రేషన్ 2001 కంపెనీ యాక్టు 1956, ఇండియన్ ట్రస్ట్ యాక్టు 1882 ద్వారా రిజిస్ట్రేషన్ అయి ఉండాలని అధికారులు తెలిపారు. ఎన్జీఓ, సీనియర్ సిటిజన్ అసోసియేషన్, ఓల్డేజ్ హోం, చిల్డ్రన్స్ హోం నిర్వహణలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. అర్హతలు ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.