
వేతన వెతలు!
● వేతనాలు రాక సీఆర్‌టీల ఇబ్బందులు
● ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబాలు
● పట్టించుకోని అధికారులు
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులపై పని ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం అదనంగా సీఆర్‌టీలను నియమించింది. కాగా, ఈ విద్యా సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 326 ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 2,102 మంది కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వారికి వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 116 మంది సీఆర్‌టీలు..
జిల్లాలోని 19 ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 116 మంది సీఆర్‌టీలు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వేతనాలు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సెప్టెంబర్ నెల వేతనం కూడా పడుతుందో లేదో తెలియదు. కాగా బయట అప్పులు చేసి తమ కుటుంబాలను వెళ్లదీసుకుంటున్నామని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి నిర్వహణ ఇబ్బందిగా మారిందని వారు వాపోతున్నారు. కొందరు ఉపాధ్యాయులు పాఠశాలలకు వచ్చేందుకు రవాణా ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాగా మొత్తం వేతనాలు విడుదల చేయకపోతే ఆందోళనలు చేపడుతామని వారు హెచ్చరిస్తున్నారు.
పెరిగిన విద్యార్థుల సంఖ్య..
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 95శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తున్నారు. కాగా సీఆర్‌టీలు ఇటు విద్యాబోధన, అటు క్రీడల్లో రాణించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.