
రైతుకు భరోసా.. కిసాన్ మాన్‌ధన్
కాజీపేట : అన్నదాతల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులు వ్యవసాయం చేస్తున్న సమయంలోనే చాలా పథకాలు ఉపయోగపడుతున్నాయి. వృద్ధాప్యంలో రైతులు ఆదాయ మార్గాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకు వయస్సులో ఉండగానే కొంత ప్రీమియం చెల్లిస్తే వృద్ధాప్యంలో ప్రతీ నెల పింఛన్ రూపంలో ఆదాయం అందేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. 60 ఏళ్లు నిండిన రైతులకు ప్రతీ నెలా రూ.3వేల పింఛన్ అందించడం ఈ పథకం లక్ష్యం.
నెలకు రూ.55 మాత్రమే..
18–40 ఏళ్లున్న రైతులు ప్రతీ నెలా వారి వయస్సుల ప్రకారం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 18నుంచి 20ఏళ్ల వరకు రూ.55లు చెల్లించాల్సి ఉంటుంది. రైతు రూ.55 చెల్లిస్తే కేంద్రం తన వాటాగా రూ.55 చెల్లించి మొత్తం రూ.110 ప్రీమియం చెల్లిస్తుంది. ఇలా 40 ఏళ్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల తర్వాత సంబంధిత రైతుకు నెలకు రూ.3వేల పింఛన్ అందుతుంది. ఒకవేళ రైతు మరణిస్తే వారి నామినికి రూ.1,500 పింఛన్ అందజేస్తారు.
ఎవరు అర్హులు..
18–40 ఏళ్లు ఉండి.. ఐదెకరాల లోపు భూమి ఉన్న సన్న, చిన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. సొంత భూమి కలిగి పట్టా పాసుపుస్తకం ఉండాలి. జాతీయ పింఛన్ పథకం (ఎన్‌పీఎస్), ఈపీఎఫ్ పరిధితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు అనర్హులు.
దరఖాస్తు సులువే..
పీఎం కిసాన్ మాన్‌ధన్ పింఛన్ కోసం ఆసక్తి, అర్హత ఉన్న రైతులు సమీపంలోని మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకుని రైతు నామిని, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయాలి. అనంతరం పింఛన్ కార్డు వస్తుంది. పీఎం కిసాన్ పథకానికి అనుసంధానమైన బ్యాంకు నుంచి ప్రీమియం నగదు చెల్లించాలి. ఆధార్ కార్డు, భూమి రికార్డు, బ్యాంకు ఖాతా పత్రాలు ఉండాలి.
అవగాహన కల్పిస్తున్నాం
కిసాన్ మాన్‌ధన్ పథకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతు వేదికల్లో జరిగే సమావేశాలతో పాటు వ్యక్తిగతంగా తెలియజేస్తున్నాం. ఈ పథకం వృద్ధాప్యంలో ఎంతో ఆసరాగా నిలుస్తుంది. ఆసక్తి ఉన్న రైతులు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు మండల వ్యవసాయ అధికారి కార్యాలయాల్లో సంప్రదించాలి.
– సంతోష్, ఏఓ, కాజీపేట
వృద్ధాప్యంలో అన్నదాతకు పింఛన్ ప్రయోజనం