
స్వదేశీ విధానంతోనే దేశం ముందడుగు
● కేయూ ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి
విద్యారణ్యపురి/ గీసుకొండ : స్వదేశీ విధానంతోనే దేశం ముందుకెళ్తుందని కాకతీయ యూనివర్సిటీ జువాలజీ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి అన్నారు. బుధవారం గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు నిర్వహించారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఏర్ప డి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొనసాగుతున్న శతాబ్ది కార్యక్రమంలో భాగంగా ఈ విజయదశమి ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో ప్రధానవక్తగా మామిడాల ఇస్తారి మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ స్థాపకుడు హెడ్గేవార్ జీవిత విశేషాలను వివరించారు.స్వాతంత్య్రానికి ముందే ఆయన కాంగ్రెస్, హిందుమహసభల్లో పాల్గొని దేశానికి సేవచేశారన్నారు. అనేక సార్లు జైలుకెళ్లారన్నారు. కేవలం స్వాతంత్య్రం సంపాదించుకోవడమేగాకుండా దానిని నిలబెట్టుకునేందుకు మళ్లీ దేశం పరాయి పాలనలోకి వెళ్లకుండా నిరోధించేందుకు స్వయంసేవకులను తీర్చిదిద్దే వేదికగా ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రారంభించారని తెలిపారు. సంఘ్ జాతీయ సమైక్యత, సాంస్కృతిక పరిరక్షణ, దేశభక్తి కోసం పోరాడి చారిత్రక విజయాలు సాధించిందన్నారు. విదేశీ వస్తువుల వినియోగంతో దేశ ఆర్థిక వ్యవస్ధ దెబ్బతింటుందన్నారు. రూపాయి విలువ పడిపోతుందన్నారు. అందుకే స్వదేశీ విధానం అనుసరించడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. కాశిబు గ్గు నగర్ సంఘ్‌సంచాలక్ చామర్తి ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ ఎల్లప్పుడూ దేశసేవలో ముందుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారి రాజు, కోటిలింగాల బస్త్తీకి చెందిన ఆర్‌ఎస్‌ఎస్ బాధ్యులు శ్రీనాథ్, వేణు, గణేశ్, నాగరాజు పాల్గొన్నారు.