
పాపం.. ఆశలు ఆవిరి
పెద్దవంగర: పాపం.. ఆ కుటుంబీకుల ఆశలు ఆవిరయ్యాయి. తమ ఇంటి పెద్ద బతికొస్తాడని భావించిన వారి కల విషాదమైంది. కుంటలోని స్తంభానికి ఏర్పాటు చేసిన డిష్ కేబుల్ వైర్ మరమ్మతుకు వెళ్లి గల్లంతైన యువకుడు మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం అవుతాపురం గ్రామానికి చెందిన కమ్మగాని అశోక్ (35), కనకతార దంపతులకు శ్రావణి, జశ్వంత్ ఇద్దరు సంతానం. అశోక్ కేబుల్ ఆపరేటర్‌గా, ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఐదుగురితో కలిసి మండలంలోని గంట్లకుంట పరిధిలోని చింతకుంటలో ఉన్న కరెంట్ స్తంభానికి ఏర్పాటు చేసిన డిష్ కేబుల్ వైర్ మరమ్మతుకు వెళ్లాడు. ముందుగా ఇద్దరు వ్యక్తులు తెప్పసాయంతో స్తంభం వద్దకు వెళ్లి మరమ్మతు చేస్తున్నారు. వారికి సహకరించడానికి అశోక్ ఈదుకుంటూ వెళ్లి నీటిలో మునిగాడు. వెంటనే వారు రక్షించే ప్రయత్నం చేసినా అశోక్ గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న ఎస్సై క్రాంతి కిరణ్, తహసీల్దార్ ఘటనాస్థలికి చేరుకుని రాత్రి వరకు రెస్క్యూ టీం, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం అశోక్ మృతదేహం లభ్యమైంది. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కుంటలో గల్లంతైన యువకుడి మృతి
శోకసంద్రంలో కుటుంబీకులు