
పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరి
కాజీపేట : ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని ఆపితే.. హెల్మెట్, లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)తో పాటు పొల్యూషన్ సర్టిఫికెట్‌ను కూడా అడుగుతారు. పొల్యూషన్ సర్టిఫికెట్ మినహా అన్ని ఉన్నాయని, వదిలేయమని వాహనదారులు చాలా సార్లు అడిగిన సందర్భాలు చూస్తుంటాం. నిజానికి పొల్యూషన్ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాల్సిందే. ద్విచక్ర వాహనం, కారు, లారీ ఇలా ఏ వాహనమైనా రోడ్డెక్కాలంటే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ (పీయూసీ) అవసరం. చాలా మంది పొల్యూషన్ సర్టిఫికెట్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మోటారు వాహన చట్టం ప్రకారం ఇది నేరం. దీనికి జరిమానా చెల్లించాల్సిందే. అసలు ఈ పొల్యూషన్ సర్టిఫికెట్ ఎందుకు అవసరం? ఇది ఎంత కాలం చెల్లుబాటు అవుతుంది? ఈ సర్టిఫికెట్‌లో ఏ వివరాలు ఉంటాయి? ఎంత చెల్లించాలో తెలుసుకుందాం..
పీయూసీ అంటే?
పీయూసీ అంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్ అని అర్థం. రోడ్డుపై వాహనం వెళ్లడం వల్ల అందులోనుంచి వచ్చే పొగలో కార్బన్ మోనాకై ్సడ్ ఎంత ఉంది.. దాని వల్ల పర్యావరణానికి ఏ మేరకు హాని కలిగే అవకాశం ఉంది.. గాలి ఎంత శాతం కలుషితమవుతుంది తదితర వివరాలతో సరిచూసి వాహనాన్ని నడిపేందుకు ఇచ్చే అనుమతి పత్రం ఇది. దేశ, రాష్ట్ర రోడ్డు రవాణా విభాగం నిర్దేశించిన యూనిట్లలోపు ఉంటేనే పొల్యూషన్ సర్టిఫికెట్ (పీయూసీ) ఇస్తారు. వాహనం ఇంజన్ నుంచి వెదజల్లే పొగ ద్వారా కాలుష్యం ఏ మేరకు వస్తుందో ఈ సర్టిఫికెట్‌లో నమోదు చేస్తారు. కేంద్ర మోటారు వాహన చట్టం–1989 ప్రకారం ప్రతి వాహనానికి సర్టిఫికెట్ తీసుకోవాల్సిందే.
పీయూసీ ఎప్పుడిస్తారు..
వాహనం కొనుగోలు చేసిన ఏడాది తర్వాత పీయూసీ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి వాహనం పీయూసీ పరీక్ష చేసి సంవత్సరం పాటు ఎలాంటి సమస్య లేదని తేలితేనే ఆ వాహనాన్ని సదరు కంపెనీ విక్రయిస్తుంది. పీయూసీ ఆరునెలలు చెల్లుబాటు అవుతుంది. ఈ తర్వాత మళ్లీ తీసుకోవాలి. ఈ పరీక్షకు రూ.60నుంచి రూ.100 వరకూ చెల్లించాలి.
నమోదు చేసే వివరాలు..
పొల్యూషన్ సర్టిఫికెట్ సీరియల్ నంబర్, టెస్టు చేసిన తేదీతోపాటు ఎప్పటి వరకు పీయూసీ చెల్లుబాటు అవుతుందో తేదీ, పొల్యూషన్ రీడింగ్ వివరాలు ఈ సర్టిఫికెట్‌లో పొందుపరుస్తారు. ఈ పీయూసీ పరీక్షా కేంద్రాలు ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లోనూ మొబైల్ వాహనాల్లో నిర్వహించి సర్టిఫికెట్ ఇస్తారు.
నిర్లక్ష్యం వహిస్తే కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం నేరం
వాహనదారులకు జరిమానా