
గ్యాస్ లీకై ందా.. డయల్ 1906
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
కాజీపేట : వంట గ్యాస్ సిలిండర్ వినియోగంలో జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలకు ఆస్కారం ఉంది. మహిళలు ఎప్పటికప్పుడు సిలిండర్‌ను కదపడం, ప్రతీసారి రెగ్యులేటర్ సరిచేయడం వంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులకు సమాచారం ఇవ్వడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలకు అవకాశం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు.
గ్యాస్ లీకేజీకి కారణాలు..
రెగ్యులేటర్‌ను సిలిండర్‌కు అనుసంధానం చేసేటప్పుడు రబ్బర్ వాషర్ (ఓరింగ్) కొన్నిసార్లు సరిగా అమర్చి ఉండదు. దీంతో రెగ్యులేటర్‌ను బిగించగానే సిలిండర్ నుంచి గ్యాస్ బయటకు వచ్చే చాన్స్ ఉంది. ఇది ఏజెన్సీ ప్రతినిధి మాత్రమే సరిగా వేయగలరు. ఇక రెగ్యులేటర్ నుంచి స్టవ్‌కు సురక్ష ట్యూబ్ ఉంటుంది. దాని కాల పరిమితి ఐదేళ్లు..పరిమితి దాటిన తర్వాత కచ్చితంగా కొత్త ట్యూబ్ తీసుకోవాలి. లేకపోతే దాని ద్వారా కూడా గ్యాస్ లీకయ్యే అవకాశం ఉంటుంది. ఏ ప్రదేశంలోనైనా గ్యాస్ లీక్ అయితే వెంటనే సంబంధిత ఏజెన్సీల అత్యవసర నంబర్‌కు గాని, టోల్‌ఫ్రీ నంబరు 1906 కాని ఫోన్‌చేయాలి. వెంటనే అక్కడి నుంచి మెకానిక్ వచ్చి సమస్య పరిష్కరిస్తారు. అందుకు వినియోగదారుడు ఎటువంటి నగదు ఇవ్వాల్సిన అవసరం లేదు.
పీడీసీ చెక్ చేసుకోవాలి..
గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి సిలిండర్ ఇచ్చిన వెంటనే వినియోగదారుడు పీడీసీ (ప్రీ డెలివరీ చెక్) చేయించుకోవాలి. ‘మా కర్తవ్యం..మీ బాధ్యత’ అనే నినాదంతో ఉన్న వాచర్ చెక్ చేసుకోవాలి. అనంతరం ఇంట్లో రెగ్యులేటర్‌ను అమర్చి చూసుకోవాలి.
గ్యాస్ వాసన గుర్తించిన వెంటనే ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి పెట్టాలి. ఎలక్ట్రికల్ స్విచ్‌లు వేయడం, అర్పడం కాని చేయకూడదు. వెంటనే ఎమర్జెన్సీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలి. చిన్నారులు, వృద్ధులను దూరంగా ఉంచాలి. గదిలో ఎల్లప్పుడు గాలి బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి.