
దుర్గా మాతకు హోమం
కోలారు: తాలూకాలోని లక్కూరు గ్రామంలో వెలసిన పురాతన శ్రీ దుర్గాదేవి దేవాలయం, సప్త మాతృకల ఆలయంలో బుధవారం అపార భక్త సమూహం మధ్యన దీపోత్సవం వేడుకను నిర్వహించారు. ఏటా మాదిరిగా కోడిహళ్లి గ్రామస్తులు, అర్చకులు వేణుగోపాల్ రావ్ నేతృత్వంలో అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. అభిషేకం గావించి, పూలతో సుందరంగా అలంకరణ చేశారు. దేవాలయం ముందు హోమం, హవనం, వేదమంత్ర పారాయణం తదితర పూజలు జరిగాయి. మహిళలు దేవికి హారతి తంబిట్టు దీపాలను తలపై మోసుకుని వచ్చి సమర్పించారు.
వేధింపులతో ఆర్‌ఐ అదృశ్యం
శివాజీనగర: ఉత్తర కన్నడ జిల్లా కుమటా పురసభ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఆర్.వెంకటేశ్ లేఖ రాసి మంగళవారం రాత్రి అదృశ్యమయ్యారు. కుమటా పురసభ ప్రధానాధికారి ఎం.ఆర్.స్వామి, ఎమ్మెల్యే దినకర్ శెట్టి వేధింపులే కారణమని లేఖలో ఆరోపించారు. భట్కళకు చెందిన వెంకటేశ్ ఆర్. ఇంట్లోనే లెటర్ రాసి, ఆ లేఖను అర్ధరాత్రి పురసభ సిబ్బంది వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. బీ ఖాతా స్థలాన్ని అక్రమంగా ఏ ఖాతాకు మార్చాలని ఒత్తిడి చేస్తున్నారని, రూ.4 లక్షలు ఇవ్వాలని వెంకటేశ్‌ను ప్రధానాధికారి పీడిస్తుండేవారని, అసభ్యకరంగా దూషించేవాడని లేఖలో రాశారు. అక్రమంగా ఖాతా మార్పు చేయలేనని బాధితుడు స్పష్టంచేశాడు. ఎమ్మెల్యే దినకర శెట్టి ఒత్తిడి చేస్తున్నారని ప్రధానాధికారి అతనిని సతాయించసాగాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భట్కళ పోలీసులు వెంకటేశ్ కోసం గాలింపు చేపట్టారు. ప్రధానాధికారిని సస్పెండ్ చేయాలని పురసభ సిబ్బంది డిమాండ్ చేశారు.
గ్యాస్ లీక్..
మంటల్లో వలస కూలీలు
దొడ్డబళ్లాపురం: భవన నిర్మాణ కూలీలు నివసిస్తున్న తాత్కాలిక షెడ్‌లో వంట గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగి 7 మంది గాయపడ్డారు. ఈ సంఘటన రామనగర తాలూకా బీమేనహళ్లిలో జరిగింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన అసన్ మల్లిక్, జాయిద్ అలీ, కబ్జుల్ షేక్, శఫీజుల్, జియాబుర్, నూర్ జమాల్, సన్రూల్ గాయపడిన కూలీలు. వీరంతా కూలి పని కోసం బిడదికి వచ్చారు. బీమేనహళ్లి వద్ద విల్లాల నిర్మాణ పనులు చేస్తూ తాత్కాలిక షెడ్‌లో నివసించేవారు. మంగళవారం రాత్రి షెడ్‌లో వంట చేసుకున్న కూలీలు భోజనం చేసి నిద్రపోయారు. అయితే సిలిండర్ నుంచి గ్యాస్ లీకవడం గమనించలేకపోయారు. తెల్లవారుజామున ఒక కూలీ బీడీ తాగడానికి అగ్గిపుల్ల గీయగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పడుకున్న 7 మందికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేసి క్షతగాత్రులను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. బిడది పోలీసులు ఘటనాస్థలంలో తనిఖీలు చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డులో
సంచార మార్పులు
బనశంకరి: సిలికాన్ సిటీలో ఔటర్ రింగ్‌రోడ్డు 9 వ మెయిన్ జంక్షన్ నుంచి 5వ మెయిన్ వరకు సర్వీస్ రోడ్డులో మెట్రో స్టేషన్ పనులు జరుగుతాయి, దీంతో రానున్న 45 రోజుల పాటు ఈ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఈ మార్గంలో సంచరించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో సంచరించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ సరిహద్దులోని ఔటర్ రింగ్‌రోడ్డు 9 వ మెయిన్‌జంక్షన్ నుంచి 5 వ మెయిన్ రోడ్డు జంక్షన్ వరకు స ర్వీస్ రోడ్డులో మెట్రోపనులు చేపడుతున్నారు. పనులు పూర్తయ్యే వరకు ఇబ్బలూరు వైపు నుంచి వచ్చి సిల్క్‌బోర్డు జంక్షన్ వైపు వెళ్లే వాహనదారులు 14 వ మెయిన్ రోడ్డు ఫ్లై ఓవర్ ద్వారా మెయిన్ రోడ్డులో 5వ మెయిన్ జంక్షన్ ద్వారా, లేదా హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ లోపలి రోడ్ల మీదుగా సిల్క్‌బోర్డు , హోసూరు మెయిన్ రోడ్డులో సంచరించాలని తెలిపారు.

దుర్గా మాతకు హోమం