ప్రైవేటు ఉద్యోగికి రూ.67 లక్షల బురిడీ | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఉద్యోగికి రూ.67 లక్షల బురిడీ

Oct 9 2025 9:21 AM | Updated on Oct 9 2025 9:21 AM

ప్రైవేటు ఉద్యోగికి  రూ.67 లక్షల బురిడీ

ప్రైవేటు ఉద్యోగికి రూ.67 లక్షల బురిడీ

బనశంకరి: బెంగళూరులో మరో భారీ సైబర్‌ మోసం బయటపడింది. పార్ట్‌టైమ్‌ ఉద్యోగం పేరుతో ప్రైవేటు ఉద్యోగికి సైబర్‌ కేటుగాళ్లు రూ.67 లక్షలు టోకరా వేశారు. బెంగళూరుకి చెందిన సతీశ్‌ బాధితుడు, ఇతడు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరి 11న అతని మొబైల్‌ఫోన్‌లోని టెలిగ్రామ్‌ యాప్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది, దానిపై క్లిక్‌ చేయగా అమెజాన్‌ ఇండియా పార్ట్‌టైమ్‌ బెనిఫిట్‌ జాబ్‌ అనే గ్రూప్‌లో చేరిపోయాడు. అమెజాన్‌ ఉత్పత్తులకు రేటింగ్‌, లైక్స్‌ ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని అందులో విపరీతంగా మెసేజ్‌లు రావడం మొదలైంది. ఇంటి దగ్గరే పార్ట్‌టైంగా డబ్బులు సంపాదింవచ్చని కొందరు ఆ గ్రూప్‌లో ప్రచారం చేయసాగారు. దీంతో సతీశ్‌ మొదట రూ.1000 పెట్టుబడి పెట్టగా రూ.1,650 తిరిగి వచ్చింది. దీంతో బోల్తా పడిన సతీశ్‌ అనేకసార్లు పెట్టుబడిపెట్టాడు. కాలక్రమేణా పెద్ద మొత్తంలో నగదు పెట్టుబడిపెడితే భారీ మొత్తంలో ఆదాయం వస్తుందని ఆశ పెట్టారు. ఇలా 7 నెలల వ్యవధిలో రూ.67,63,950 ని తన బ్యాంకు ఖాతాల నుంచి మోసగాళ్ల ఖాతాలకు పంపించాడు. ఆపై ఎలాంటి ఆదాయం రాకపోవడంతో పాటు దుండగులు అతని నంబరుని బ్లాక్‌ చేశారు. మోసపోయిన సతీశ్‌.. స్థానిక సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.

బీరువాలో రూ.10 లక్షలు మాయం

మైసూరు: వంట కాంట్రాక్టరు గిడ్డంగిలో రూ.10 లక్షల నగదు మాయమైంది. వివరాలు... శ్రీరంగపట్టణకు చెందిన వంట కాంట్రాక్టర్‌ రమేష్‌కు మైసూరులోని కువెంపునగర ఎం బ్లాక్‌లోని గోదాము ఉంది. అందులోని బీరువాలో తన ఇంటి నిర్మాణం కోసం రూ.10 లక్షల నగదును భద్రపరిచి తాళాలను టేబుల్‌ డ్రాలో ఉంచుకున్నాడు. మంగళవారం బీరువాను చూడగా ఖాళీగా ఉంది. తాళాలు తీసుకుని నగదును చోరీ చేశారంటూ సిబ్బంది గణేష్‌, సోమణ్ణ, గిరీష్‌, స్వామి, లక్ష్మమ్మ, మహేష్‌, ప్రజ్వల్‌లపై కువెంపునగర పోలీసు స్టేషన్‌లో అతడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

తల్లయిన చిన్నారి బాలిక

నిందితుడు అరెస్టు

తుమకూరు: చదువుకునే బాలిక శిశువుకు జన్మనిచ్చిన ఘటన జిల్లాలోని కుణిగల్‌ తాలూకాలో జరిగింది. బాలిక ఆరోగ్యం సరిగ్గా లేదని తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె 8 నెలల గర్భిణి అని వైద్యులు తెలిపారు. బాలికను నిలదీయడంతో జరిగిన మొత్తం విషయం చెప్పింది. తక్షణమే బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఆడశిశువుకు జన్మనిచ్చింది. మరోవైపు ఆమె గర్భానికి కారణమైన నిందితుడు వినయ్‌ (21)ని పోలీసులు అరెస్టు చేశారు. సదరు బాలిక, యువకుడు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉంటారు. ప్రేమపేరుతో లోబర్చుకుని పలుమార్లు అత్యాచారం చేశాడని బాలిక తల్లి కుణిగల్‌ ఠాణాలో ఫిర్యాదు చేసింది. నిందితునిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు.

గంగమ్మకు అపచారం

చిక్కబళ్లాపురం: తాలూకా పరిధిలోని శ్రీనివాససాగర జలాశయం వద్ద గంగమ్మ తల్లి విగ్రహానికి ఘోర అపచారం జరిగింది. మూడు రోజుల కిందట జరిగిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. జలాశయం గోడ మీద నుంచి జలాలు జాలువారుతూ ఉంటాయి. అక్కడ కింద గంగమ్మ విగ్రహం ఉంది. కొందరు మహిళలు, బాలికలు అక్కడ నీటిలో ఆడుకుంటూ అమ్మవారి విగ్రహం మీద కాళ్లు పెట్టి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. ఆ ఫోటోల ద్వారా విషయం బయటపడింది. హిందూ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement