
బిగ్‌బాస్‌కు షాక్.. స్టూడియో బంద్
యశవంతపుర: కన్నడ బిగ్‌బాస్ ప్రదర్శనకు సిద్దరామయ్య సర్కారు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ స్టూడియోకి బెంగళూరు దక్షిణ జిల్లా అధికారులు బీగం వేసి మూసేశారు. పోలీసులు, కాలుష్య నియంత్రణ మండలి ఇంకా పలు విభాగాల అనుమతులు లేవని తెలిపారు. పోటీదారులను నిర్వాహకులు దగ్గరిలోని ఈగల్‌టన్ రిసార్టుకు తరలించారు. అయితే పోటీదారులు మొబైల్‌ఫోన్లను వాడరాదని, టీవీలు చూడరాదని అధికారులు నిర్బంధం విధించడం గమనార్హం. కన్నడంలో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ ప్రారంభమైన రెండు వారాలకే అనూహ్యంగా బంద్ చేయడంతో ప్రేక్షకులు ఏమైందోనని ఆదుర్దాకు గురయ్యారు.
ఏం జరిగింది?
బిడది వద్ద పెద్ద విస్తీర్ణంలో ప్రత్యేక సెట్టింగ్‌ను వేసి బిగ్‌బాస్ 12వ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. ప్రముఖ నటుడు కిచ్చ సుదీప్ పర్యవేక్షకునిగా ఉన్నారు. అధికారులు వెళ్లినప్పుడు నిర్వాహకులతో గొడవ జరిగిందని తెలిసింది. బిడది తహశీల్దార్, పోలీసులు హౌస్‌ని ఖాళీ చేయించి తాళం వేశారని సమాచారం. కాగా, బిగ్‌బాస్ కోసం 400 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారి ఉపాధిని దూరం చేయవద్దని నిర్వాహకులు జిల్లా కలెక్టరును కోరారు. పొరపాట్లను సరిచేసుకోవడానికి కొన్నిరోజులు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
జేడీఎస్ విమర్శలు
కిచ్చ సుదీప్ నిర్వహిస్తున్న బిగ్‌బాస్ స్టూడియో మూసివేత వెనుక నట్లు, బోల్టుల మినిస్టర్ ఉన్నాడంటూ డీసీఎం డీకే శివకుమార్‌పై జేడీఎస్ నాయకులు మండిపడ్డారు. కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కూడా ఇదేమాదిరి విమర్శలు చేశారు.
హైకోర్టులో కేసు
షోను బంద్‌చేయడంపై నిర్వాహకులు బుధవారం మధ్యాహ్నం హైకోర్టులో కేసు వేసి త్వరగా విచారించాలని విన్నవించారు. విచారణను నిర్వహించి జడ్జి గురువారానికి వాయిదా వేశారు.
నిబంధనలను ఉల్లంఘించారని
అధికారుల చర్యలు
సర్కారుపై ప్రతిపక్షాల విమర్శలు

బిగ్‌బాస్‌కు షాక్.. స్టూడియో బంద్